Tollywood: అర్థమవుతోందా టాలీవుడ్‌!.. ట్రోలింగ్‌ వార్‌.. రెండు వైపులా వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే కట్‌..

తెలుగు సినిమాను బాగా ఇబ్బంది పెట్టే అంశం ఏంటి? అని అడిగితే ఒకప్పుడు ముక్తకంఠంతో అందరూ ‘పైరసీ’ అని చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ మాట ఎవరూ చెప్పడం లేదు. దాని స్థానంలో ‘ట్రోలింగ్‌’ అని అంటున్నారు. ప్రస్తుతానికి అందరూ ఈ మాట అనకపోయినా.. త్వరలో అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఎవరు తీసుకొస్తున్నారు, ఎందుకు తీసుకొస్తున్నారు, ఎలా తీసుకొస్తున్నారు అనే విషయం గురించి క్లారిటీ ఇటు టాలీవుడ్‌లో, అటు తెలుగు సినిమా ఫ్యాన్స్‌లో అందరికీ తెలుసు.

Tollywood

అయితే, ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఆ విషయం కాదు. ఇండస్ట్రీలో కొందరు పెంచి పోషించిన సినిమా పెద్దలు. ఒక హీరో సినిమా వస్తోంది అంటే.. ఆటోమేటిగ్గా కొన్ని సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ యాక్టివ్‌ అయిపోతున్నాయి. వేల కొద్దీ ఫాలోవర్లు ఉన్న ఆ పేజీలో ఆ సినిమా గురించి ఏవేవో పోస్టులు వస్తాయి. వాటికి కామెంట్లు కూడా అలాంటివే పడుతుంటాయి. ఎవరో ఏదో అంటారు.. దానికి ఇంకెవరో ఏదో రిప్లై ఇస్తారు. సంబంధం లేని టాపిక్‌లోకి ఆ డిస్కషన్‌ వెళ్లిపోతుంది.

ఇదంతా చూస్తే… ‘ఎవర్రా మీరంతా’ అనే మీమ్‌ కచ్చితంగా మదిలో మెదులుతుంది. దానికి ఆన్సర్‌ చెప్పేవారు ఎవరూ ఉండరు. ఆ సినిమా అలా థియేటర్ల నుండి బయటకు వెళ్లిందో లేదో.. వెంటనే ఆ హ్యాండిల్స్‌ ఆ పోస్టులు ఆగిపోతాయి. మళ్లీ ఆ హీరో సినిమా వచ్చినప్పుడు వారంతా మమేకమై.. మనసు పారేసుకొని.. నోరు పారేసుకుంటూ ఉంటారు. దీని వల్ల వాళ్లేం ఆనందం పొందుతున్నారు అనేది పక్కన పెడితే.. సినిమా పరిశ్రమ ఏం కోల్పోతోంది అనేది మాత్రం గుర్తించాలి.

ఇదంతా చెబుతున్న సమయంలో ఏ సినిమాల గురించి, ఏ హీరోల గురించీ, వాళ్ల అభిమానుల గురించి, వాళ్ల అనుచరగణం గురించి పేర్లు ప్రస్తావించాలని అనుకోవడం లేదు. ఎందుకంటే అందరూ అందరే. అవసరం మేరకు కొంతమంది, ఆవేశంతో ఇంకొంతమంది, అక్కసుతో మరికొంతమంది, ఆలోచన లేక ఇంకొందరు.. మొత్తంగా దాదాపుగా అందరూ ఇలానే మారిపోతున్నారు. మారని హీరోలు ఎవరైనా ఉంటే, మారని అభిమానులు ఎవరైనా ఉంటే వాళ్లు కోహినూర్‌ వజ్రాలే.

గత కొన్ని నెలలుగా టాలీవుడ్‌లో ఓ కొత్త సినిమా వస్తోంది అంటే.. సోషల్‌ మీడియా గొంతు చించుకుంటోంది. దీన్ని ఎవరు స్టార్ట్‌ చేశారు, ఎవరు కంటిన్యూ చేశారు అనేది వదిలేసి.. ఇకనైనా స్టాప్‌ బటన్‌ నొక్కాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో పైరసీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన మన హీరోలు.. ఇప్పుడు ఈ ట్రోలింగ్‌ దుర్బుద్ది విషయంలో పోరాటం చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ పని చేస్తున్న/ చేయిస్తున్న వాళ్లు ఆపేయాలి. చేయని వాళ్లు/ చేయాలని అనుకునేవాళ్లు స్టార్ట్ చేయకూడదు.

ఎందుకంటే ట్రోలింగ్‌ వార్‌ అనేది రెండు వైపులా వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే కట్‌ అవుతుంది. ట్రోల్‌ చేసినోడి సినిమానే స్మాష్‌ అవుతుంది. అర్థమైందా రాజా.. అర్థం కాకపోతే కష్టం రాజా.

నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus