బాలయ్యను నేను జీవితంలో మర్చిపోలేను!

  • November 20, 2017 / 12:56 PM IST

మీడియా ముందే ముతక మాటలు మాట్లాడడం, తనకు అడ్డొచ్చిన లేదా ఇబ్బంది కలిగించిన అభిమానులని చాచిపెట్టి కొట్టడం వంటి కారణాల వలన ఇప్పటివరకూ బాలయ్య నెగిటివ్ సైడ్ మాత్రమే మీడియాకి, జనాలకి కనిపించింది. అయితే.. ఆ కనిపించని నాలుగో సింహంలాగే బాలయ్యలో కనిపించని మరో యాంగిల్ ఉంది. ఈ విషయం ఆయన సన్నిహితులకు తప్పితే ఎవరికీ సరిగా తెలియదు. నా అనుకున్నవారి కోసం బాలయ్య ఎంతదూరమైనా వెళ్తారు, ఎంత కష్టమైనా భరిస్తారు. ఈ విషయం ఇటీవల మరోమారు ఉదయభాను ద్వారా వెలుగులోకి వచ్చింది.

గత రెండు దశాబ్ధాలుగా యాంకర్ గా, నటీమణిగా తెలుగు చిత్రసీమలో కొనసాగుతున్న ఉదయభానుకి దాదాపుగా సినిమా స్టార్లందరూ సుపరిచితులే. అయితే.. మొన్నామధ్య ప్రెగ్నస్నీ టైమ్ లో కాస్త గ్యాప్ రావడం ఆ తర్వాత సరిగ్గా టీవీలోను కనిపించకపోవడంతో దాదాపుగా ఉదయభాను కనుమరుగయ్యింది అనుకొన్నారందరూ. కానీ.. కొన్నాళ్ళకి ఏకంగా కవల పిల్లలతో కనిపించిన ఉదయభానును చూసి అందరూ షాక్ అయ్యారు. తన కవల పిల్లల మొదటి జన్మదిన వేడుకకు ఇండస్ట్రీలోని తన పరిచయస్తులందరినీ పిలిచిందట. కొందరు వస్తామని చెప్పి రాకపోగా, ఇంకొందరు కనీసం ఫోన్ కూడా ఎత్తలేదట.

అయితే.. బాలకృష్ణ మాత్రం కేవలం ఒక్క మెసేజ్ పెట్టేసరికి వేరే పోలిటికల్ మీటింగ్ ఉన్నా సరే.. ఉదయభాను ఇంటికి వెళ్ళి అక్కడ దాదాపు 45 నిమిషాలపాటు సమయాన్ని వెచ్చించడంతోపాటు.. అక్కడికి వచ్చిన ఉదయభాను బంధువులు-స్నేహితులకు ఫోటోలు కూడా ఇచ్చాడట. ఈ విషయాన్ని ఉదయభాను స్వయంగా చెప్పి కన్నీరు పెట్టుకొంది. ఇలాంటి విషయాలు తెలిసినప్పుడే అనిపిస్తుంది “బాలయ్య భలేవాడు అని”.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus