స్టార్ హీరో కావడానికి.. ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ రావడానికి ఒకే ఒక్క సినిమా చాలు అని నిరూపించిన నటుడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి చిత్రంతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రభాస్ తర్వాత ఎక్కువమంది మహిళా అభిమానులు కలిగిఉన్న హీరో ఎవరంటే విజయ్ పేరే వినిపిస్తోంది. ఆ క్రేజ్ తోనే దర్శకనిర్మాతలు అతని వెంట పడుతున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ టాక్సీవాలా , గీత గోవిందం చిత్రాలను కంప్లీట్ చేశారు. ఇవి త్వరలో రిలీజ్ కానున్నాయి. అలాగే నోటా సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉండగా, డియర్ కామ్రేడ్ రీసెంట్ గా ప్రారంభమయింది. వీటితో పాటు కెఎల్ఎం వంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.
తాజాగా అతను మరో కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా సంతకం చేశారు. యూసుఫ్‌గూడ సెయింట్ మేరీస్ కళాశాల ప్రాంగణంలో మంగళవారం విజయ్ అభిమానుల మధ్య సంగీత మొబైల్స్ సంస్థతో ఒప్పందంపై సంతకాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ” నేను సెల్‌ఫోన్‌కు ఎంత దూరంగా ఉందామని ప్రయత్నించినా ఉండలేకపోతున్నాను, జీవితంలో సెల్‌ఫోన్ వినియోగం తప్పని సరైంది. ఈ ఒప్పందం ద్వారా తనపేరు సంగీత దేవరకొండగా మారింది” అని విజయ్ చెప్పారు. మరికొన్ని కంపెనీలు విజయ్ సాయంతో తమ బ్రాండ్ వ్యాల్యూ పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాయి.