హాలీవుడ్ సినిమాలు, విదేశీ సినిమాలను అసలు విషయం చెప్పి కొంతమంది, చెప్పకుండా కొంతమంది మన దగ్గర సినిమాలుగా తీసుకొస్తుంటారు. చెప్పి తెస్తే రీమేక్ అవుతుంది. చెప్పకుండే తెస్తే ఫ్రీమేక్ అవుతుంది. దీనికి ఇన్‌స్పిరేషన్/ అనే పేరు పెట్టుకున్నారు అనుకోండి. ఇక అసలు విషయానికొస్తే ఇలా అక్కడి సినిమాలు మన దగ్గరకు వస్తున్న ఈ రోజుల్లో మన ఇండియన్ సినిమా ఒకటి హాలీవుడ్‌కి వెళ్తోంది. గత కొన్ని రోజులుగా ఈ మేరకు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా.. ఇప్పుడు కన్‌ఫామ్ అయింది.
ఇదంతా ‘మహారాజ’ సినిమా గురించే అని మీకు అర్థమయ్యే ఉంటుంది. విజయ్ సేతుపతి ప్రధానపాత్రలో నటించిన చిత్రమిది. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సేతుపతి కెరీర్‌లోనే మంచి గుర్తింపు తెచ్చిన చిత్రంగా నిలిచిపోయింది. ఇప్పుడీ సినిమానే హాలీవుడ్‌లో రీమేక్ కానుంది. హాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘ప్యాషన్ స్టూడియోస్’ ఈ సినిమాను రీమేక్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. హాలీవుడ్‌లో రీమేక్ కానున్న మొదటి తమిళ సినిమాగా ఈ సినిమా రికార్డులెక్కింది.
‘మహారాజ’ హాలీవుడ్ రీమేక్‌లో విజయ్ సేతుపతి పాత్రను ఆస్కార్ విన్నర్, స్టార్ హీరో మాథ్యూ మెక్ కొనాగే పోషించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు మంచి ఫలితం వస్తే.. మన కథలు మరిన్ని హాలీవుడ్‌కి వెళ్తాయి. అయితే ఇలాంటి కథా నేపథ్యంగా బలంగా ఉన్న సినిమాలకు మాత్రమే ఆ అవకాశం. నార్మల్ మాస్, కమర్షియల్ సినిమాలు తీసి ఇలాంటివి ఎక్స్‌పెక్ట్ చేయలేం. కాబట్టి సరైన కథలు తీస్తే అటు వెళ్లొచ్చు.
సినిమా కథ విషయానికొస్తే.. మహారాజ (విజయ్ సేతుపతి) ఓ సెలూన్ షాప్ నడుపుకుంటూ ఉంటాడు. తన భార్య ఓ యాక్సిడెంట్‌లో చనిపోతుంది. అదే ప్రమాదంలో తన కూతురు జ్యోతి ప్రాణాలతో బయటపడుతుంది. ఓ ఇనుప చెత్త బుట్ట ఆ పాపపై పడటంతో బతికి బయటపడుతుంది. తన కూతురు ప్రాణాలు కాపాడటంతో ఆ చెత్తబుట్టకి లక్ష్మి అని పేరు పెట్టి ఇంట్లో మనిషిగా ప్రేమగా చూసుకుంటాడు మహారాజ. అయితే ఒకరోజు తన ఇంట్లోని ఆ చెత్తబుట్ట పోయిందని, వేరే ఊరు వెళ్లిన తన కూతురు వచ్చేలోపు ఆ చెత్తబుట్టను కనిపెట్టమని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఆ చెత్తబుట్ట పోలీసులకి దొరికిందా? స్పోర్ట్స్ క్యాంప్‌కి వెళ్లిన మహారాజ కూతురు తిరిగి వచ్చిందా అనేదే సినిమా.