ఇలయదళపతి విజయ్‌కి తమిళంలో ఎక్కువ అభిమానులున్నారన్న సంగతి తెలిసిందే. అయితే టీజర్ రిలీజ్ ని కూడా ఓ పండుగలా చేసుకుంటారనే సంగతి నిన్ననే తెలిసింది. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ తన 62వ సినిమాగా చేస్తున్న సర్కార్ మూవీ టీజర్ శుక్రవారం సాయంత్రం రిలీజ్ అయి సంచలనం సృష్టించింది. ఈ టీజర్ కేవలం పదినిముషాల్లో మిలియన్‌కి పైగా వ్యూస్ సాధించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇరవైనిముషాల్లో 2 మిలియన్, 35 నిముషాల్లో మూడు మిలియన్ వ్యూస్ సాధించి ఔరా అనిపించింది. ఒక్కరోజు కూడా పూర్తికాకముందే 12 మిలియన్ ప్లస్ వ్యూస్ సాధించిన ఈ టీజర్ యూట్యూబ్ రికార్డులను తిరగరాస్తోంది. అలాగే అత్యంత వేగంగా ఒక మిలియన్ కి పైగా లైక్స్ అందుకున్న టీజర్ గా రికార్డ్ నెలకొల్పింది.
మల్టీ మిలినియర్ అయిన విజయ్ తన ఓటును వినియోగించుకోవడానికి ఇండియాకి రావడం, ఆ తర్వాత జరిగే పరిణామాలను మురగదాస్ తనదైన స్టయిల్‌లో తెరకెక్కించినట్లు టీజర్ స్పష్టం చేసింది. కార్పొరేట్ క్రిమినల్ గా విజయ్ క్యారక్టర్ ని డిఫెరెంట్ గా మలిచిన తీరు అభిమానులకు విపరీతంగా నచ్చింది. సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి గిరీష్ గంగాధన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, టీ సంతానం ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 6న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది.