హీరోల స్థాయిని అమాంతం పెంచడంలో మాస్ డైరక్టర్ వివి వినాయక్ దిట్ట. మాస్ ప్రేక్షకుల ఫాలోయింగ్ కావాలనుకునేవారు తప్పకుండా ఇతని దర్శకత్వంలో నటించాలని కోరుకుంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వినాయక్ దర్శకత్వంలో నటించాలని అనుకున్నారు. కొన్ని నెలల క్రితం కథ కూడా విన్నారు. స్క్రిప్ట్ చర్చలు కొనసాగాయి. ఈ ప్రాజక్ట్ గురించి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తారని అనుకునేలోపే ఆగిపోయిందనే వార్త బయటికి వచ్చింది. ఎందుకు ఆగిపోయిందో ఎవరికీ తెలియదు. అప్పుడు డైరక్టర్.. హీరో.. ఎవరూ నోరు మెదపలేదు. తాజాగా ఆ విషయం వెలుగులోకి వచ్చింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా వినాయక్ తెరకెక్కించిన మూవీ ఇంటలిజంట్ ఈనెల 9 న రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా డైరక్టర్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఆ సమయంలో మహేష్ బాబు సినిమా గురించి ఆయన్ని అడగగా.. ఇలా స్పందించారు. “మేమిద్దరం కలిసి సినిమా చేయాలనుకున్నాం. అది నిజమే. కథా చర్చలు కూడా జరిగాయి. కానీ కథ మహేష్ కి నచ్చలేదు. కథ నచ్చితే తప్పకుండా చేస్తానన్నారు.” అని వినాయక్ అసలు విషయం చెప్పారు. వినాయక్ దర్శకత్వంలో మహేష్ నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. వారి కల ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.