‘గాడ్ ఆఫ్ వార్’.. ఈ సినిమా గురించి ఎన్నో నెలలుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. సినిమా అలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అని లీక్‌లు రావడం, నిర్మాత నాగవంశీ చెప్పడం లాంటివి మీరు చూసే ఉంటారు. అంతకుముందు కూడా సినిమా గురించి పెద్ ఎత్తున చర్చ జరిగింది. దానికి కారణం ఈ సినిమాలో హీరో ఎవరు అనే విషయంలో క్లారిటీ రాకపోవడమే. ఇద్దరు హీరోల మధ్య ఆ కథ చక్కర్లు కొట్టడమే కారణం.
సుబ్రహ్మణ్య స్వామి జీవితంలోని కీలక ఘట్టాల ఆధారంగా రాసుకున్న కథతో త్రివిక్రమ్ ఆ సినిమాను తెరకెక్కిస్తారని నిర్మాత నాగవంశీ చెప్పారు. టైటిల్ పాత్రలో ఎవరు నటిస్తారు అనే విషయంలో రకరకాల చర్చలు జరిగినా.. ఎక్కువగా అల్లు అర్జున్ – ఎన్టీఆర్ పేర్లు వినిపించాయి. తొలుత అతనని, ఆ తర్వాత ఇతనని చెప్పుకొచ్చారు. అనౌన్స్‌మెంట్‌లు అయిపోయినా, ఆ తర్వాత పేర్లు మార్పు ప్రక్రియ జరుగుతూనే వచ్చింది. ఫైనల్లీ తారక్ ఫిక్స్ అయ్యాడు.
అయితే, ఇప్పుడు చేస్తున్న ‘డ్రాగన్’ సినిమా తర్వాత తారక్ అనిల్ రావిపూడి సినిమా చేస్తాడు అనేసరికి.. మళ్లీ ఈ కథ అల్లు అర్జున్ దగ్గరకు వెళ్తుందా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే 2028 వేసవి వరకు తారక్‌కి ఖాళీ కుదరదు కాబట్టి.. త్రివిక్రమ్ వేరే హీరోను చూసుకోవాల్సిందే అనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే తమ ప్రాజెక్ట్ అలానే ఉంది అని, ఇటీవల నాగవంశీ చెప్పకనే చెప్పారు. దీంతో అసలేం జరుగుతుంది అనే చర్చ మాత్రం జరుగుతూనే ఉంది.
అలా అని, అల్లు అర్జున్ ఏమన్నా ఖాళీగా ఉన్నాడా అని చూస్తే.. అదీ లేదు. ప్రస్తుతం ‘రాకా’ సినిమా పనుల్లో బిజీగా ఉండగా.. ఆ తర్వాత లోకేశ్ కనగరాజ్‌తో ‘గ్యాంగ్‌స్టర్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా చేస్తాడు. ఆ తర్వాత బసిల్ జోసెఫ్‌తో ‘ఐకాన్’ (ప్రచారంలో ఉన్న పేరు ) అనే సినిమా చేస్తాడని అంటున్నారు. కాబట్టి ఆయనా బిజీ.. సో త్రివిక్రమ్ ఏం చేస్తారు అనేది గజిబిజీ.