హ్యాట్రిక్ హిట్ తో దూసుకుపోతోన్న ఎన్టీఆర్ జై లవకుశ తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. బాబీ దర్శకత్వంలో తారక్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన సినిమా 125కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సినిమా తరవాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్న మూవీ ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వెళ్ళడానికి చాలా సమయం పట్టేట్టు ఉందని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. కారణం త్రివిక్రమ్ ప్రస్తుతం చేస్తున్న పవన్ కళ్యాణ్ సినిమానే. దీనిపైనే డైరక్టర్ కాన్సంట్రేషన్ పెట్టినట్లు సమాచారం. వీరి కాంబినేషన్లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
మూడో సినిమా అంతకు మించి హిట్ కావాలని శ్రమిస్తున్నారు. ఈ చిత్ర ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జనవరి వరకు ఫుల్ బిజీగా ఉండనున్నారు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ స్క్రిప్ట్ వర్క్ లో పడనున్నారు. అందుకోసం రెండు నెలలు కేటాయించనున్నారు. సో ఎన్టీఆర్ 28 వ మూవీ మార్చిలోనే సెట్స్ మీదకు వెళుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధా కృష్ణ నిర్మించనున్న ఈ మూవీపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకొని ఉన్నారు.