అక్కినేని ప్రిన్స్ అఖిల్ మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టినా.. రెండో సినిమా నిలబడింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ చేసిన హలో మూవీ విజయం సాధించింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లలో అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ మూవీ మంచి కలక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్ లోను అఖిల్ కి ఫాలోయింగ్ ని ఏర్పరిచింది. ఈ ఉత్సాహంతో అఖిల్ తన నెక్స్ట్ సినిమాని వెంటనే ప్రారంభిస్తారని అందరూ అనుకున్నారు. అఖిల్ కూడా తన నెక్స్ట్ సినిమా వివరాలను జనవరి 10 న వెల్లడిస్తానని అన్నారు. ఆ తేదీ పోయి ఇరవై రోజులు అవుతున్నా నెక్స్ట్ సినిమా గురించి ఏ సమాచారం లేదు.
ఫిలిం నగర్లో అఖిల్ నెక్స్ట్ సినిమాపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఒక కొత్త డైరక్టర్ దర్శకత్వంలో నటించడానికి అఖిల్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ గా చేసిన యంగ్ డైరెక్టర్.. అఖిల్ కి కథ చెప్పారని, అది నచ్చడంతో స్క్రిప్ట్ ని డెవలప్ చేసే పనిలో ఉన్నట్లు టాక్. నాగార్జున కెరీర్ మొదట్లో అనేక సీనియర్ డైరెక్టర్లతో సినిమాలు చేసి మంచి విజయం అందుకోలేకపోతున్న సమయంలో యంగ్ డైరక్టర్ రామ్ గోపాల్ వర్మకి అవకాశమిచ్చారు. ఆ కొత్త డైరక్టర్ తీసిన శివ సంచలన విజయం సాధించింది. అటువంటి హిట్ కోసం అఖిల్ ఈ సాహసం చేస్తున్నట్టు తెలిసింది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో త్వరలోనే తెలియనుంది.