సినిమా పరిశ్రమలో అవార్డుల గురించి, రివార్డుల గురించి మాట్లాడేటప్పుడు.. సినిమా పెద్దలు, సీనియర్ నటులు, సాంకేతిక నిపుణులు ఎప్పుడూ చెప్పే మాట.. ‘మాకు కావాల్సింది మెచ్చుకోళ్లే.. మా సినిమాకు, మా పనిని పది మంది మెచ్చుకుంటే అదే చాలు’ అని అంటుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే ‘పనికి ప్రశంస రావాలి’ అని చెబుతారు. దీని కోసం నంది అవార్డులు, జాతీయ అవార్డులు గురించి చెబుతుంటారు. అయితే ఇంత చెప్పే సినిమా తారలు తమ తోటి నటులు ఇచ్చిన ప్రదర్శనను మెచ్చుకోరా?
ఏమో.. టాలీవుడ్ గత కొన్ని నెలలుగా పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. ఫలితాల సంగతి పక్క పెట్టి మంచి నటనను, ఇప్పటివరకు ఎవరూ చేయడానికి సాహసించని పాత్రలను, డేరింగ్ చేసి ఎంచుకున్న కథలను మెచ్చుకుంటున్న స్టార్ హీరోలు, కొత్త స్టార్ హీరోలు కనిపిస్తున్నారా అంటే చాలా తక్కువే అని చెప్పాలి. ఇక్కడ ఏ ఒక్కరినీ అనడం లేదు. ఎందుకంటే ఇంకో హీరో సినిమా వచ్చి, అందులోని పాత్ర బాగున్నా ఇతర హీరోల నుండి ప్రశంసలు రావడం లేదు.
అయినా, వారూ వారూ మాట్లాడుకున్నారేమో, అన్నీ బయటకు చెబుతారా ఏంటి? అనే ప్రశ్న మీ నుండి రావొచ్చు. ఒకవేళ అలా జరిగి ఉన్నా ఆ విషయం బయటకు చెప్పాలి. ఎందుకంటే ఈ సహృద్భావ వాతావరణ హీరోల మధ్య లేదు అనుకునే కొంతమంది అభిమానులు ఇప్పటికీ దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫలానా హీరో.. ఫలానా హీరోకి ఫోన్ చేసి మెచ్చుకున్నాడట అనే మాట బయటకు ఎన్ని ఎన్ని అభిప్రాయ బేధాలు సమసిపోతాయో మీకు తెలుసు.
రీసెంట్ టైమ్స్‌లో కొంతమంది హీరోలు సినిమాలు రివ్యూలు ఇస్తున్నారు. అయితే ఆ హీరోకి ఫ్రెండ్స్ అయితేనో, లేక ఆ వ్యక్తితో భవిష్యత్తులోనో, ప్రస్తుతమో పని చేస్తుంటేనో ఆ రివ్యూలు వస్తున్నాయి. లేదంటే కుటుంబ సభ్యుల్లాంటి హీరోల మధ్య ఈ వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పరిశ్రమలో అంతా పాజిటివ్ వైబ్స్ కావాలి అంటే ఎవరో ఒకరు ముందడుగు వేయాలి. సీనియర్ స్టార్ హీరోల యంగ్ టైమ్‌లో చిరంజీవి ఈ పని చేశారని చెబుతారు. ఇప్పుడు ఆ స్టెప్ వేసేది ఎవరు?