వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచిత్రం అదిరింది

  • January 7, 2019 / 12:53 PM IST

దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా “ఆనందో బ్రహ్మ” ఫేమ్ మహి వి.రాఘవ తెరకెక్కిస్తున్న చిత్రం “యాత్ర”. రాజశేఖర్ రెడ్డిగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ను ఇవాళ విడుదల చేశారు. టీజర్ తోనే మంచి అంచనాలను క్రియేట్ చేసిన “యాత్ర” టీం… ట్రైలర్ తో ఆ అంచనాలను ద్విగుణీకృతం చేశారు. ట్రైలర్ మొత్తం రాజశేఖర్ రెడ్డి జీవితాన్ని మళ్ళీ చూస్తున్నట్లే ఉంది. ఆ జుట్టు తప్పితే మమ్ముట్టి హావభావాలు కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ అచ్చుగుద్దినట్లు వై.ఎస్.ఆర్ ను తలపిస్తుండడం విశేషం.

విజయమ్మగా “బాహుబలి” ఫేమ్ ఆశ్రిత కూడా సరిగ్గా సెట్ అయ్యింది. రాజశేఖర్ పుట్టుక నుంచి కాక ఆయన రాజకీయ జీవితం మీదే ఎక్కువగా దృష్టి సారించారు. ముఖ్యంగా ఆయన పేదలకు, రైతులకు ఏ విధంగా అండగా నిలిచాడు అనేది ఈ సినిమాలో మహి వి.రాఘవ అద్భుతంగా చూపించినట్లుగా అర్ధమవుతోంది. ఫిబ్రవరి 8న విడుదలవుతున్న ఈ చిత్రంపై నిన్నమొన్నటివరకూ పెద్దగా ఆసక్తిచూపనివారు కూడా ఇప్పుడు ఆసక్తి కనబరుస్తున్నారు. ట్రైలర్ మొత్తంలో మైనస్ ఏమైనా కనబడింది అంటే అది మమ్ముట్టి స్వంత డబ్బింగ్ మాత్రమే. ఆయన పాత్రకు వేరే ఎవరైనా మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పి ఉంటే ఆ క్యారెక్టర్ కి ఇంకాస్త ఎస్టాబ్లిష్ మెంట్ ఉండేది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus