టాలీవుడ్లో కొన్ని సినిమాలు కేవలం బాక్సాఫీస్ రికార్డుల వేట కోసమే కాకుండా, ఒక నటుడి ఇమేజ్‌ని పూర్తిగా మార్చేయడానికి కూడా పుడతాయి అని చెప్పాలి. అలాంటి సినిమాల్లో ‘పోకిరి'(Pokiri) ఒకటి.
సరిగ్గా 20 ఏళ్ల క్రితం అంటే 2006 ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలైంది.ఈ సినిమాకు ముందు మహేష్ బాబు ఒక మంచి నటుడు మరియు ‘ప్రిన్స్’, స్టార్ హీరో అనే ట్యాగ్ కూడా పొందాడు. కానీ ‘పోకిరి’ తర్వాత మహేష్ నెంబర్ వన్ హీరో రేసులోకి దూసుకెళ్ళాడు.
‘పోకిరి’ చిత్రానికి ముందు మహేష్ బాబుకు యూత్,ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉండేది.’అతడు’ కూడా మహేష్ ని మరో మెట్టు పైకి ఎక్కించింది. అతనికి ఓవర్సీస్ మార్కెట్ తెచ్చిపెట్టింది. కానీ, థియేటర్ల దగ్గర మాస్ జాతర ఎలా ఉంటుందో మహేష్ కి కానీ అతని అభిమానులకి కానీ రుచిచూపించింది మాత్రం పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘పోకిరి’ అనే యాక్షన్ డ్రామానే. ఈ సినిమాతో మహేష్ బాబు ఒక కంప్లీట్ మాస్ హీరోగా అవతరించాడు.
మహేష్ బాబు కెరీర్ గురించి చెప్పాలంటే ‘ ‘పోకిరి’ ముందు – ‘పోకిరి’ తర్వాత’ అనడంలో ఎటువంటి అతిశయోక్తి అవసరం లేదు.అలాంటి ‘పోకిరి’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :
2002 లో వచ్చిన హాంకాంగ్ సినిమా ‘ఇంటర్నల్ అఫైర్స్’ ఆధారంగా పూరీ ఒక లైన్ అనుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘రుస్తుం’ ‘స్టేట్ రౌడీ’ సినిమాల స్పూర్తితో ఆ లైన్ ని డెవలప్ చేసుకున్నాడు. దానికి ‘ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్య నారాయణ’ అనే పేరు పెట్టాడు.పవన్ కళ్యాణ్ తో చేయాలని అనుకున్నాడు. కానీ పవన్ రిజెక్ట్ చేశాడు. రవితేజతో సెట్స్ పైకి తీసుకెళ్ళాడు. నాగబాబు కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించేందుకు ముందుకు వచ్చారు.
2 రోజులు షూటింగ్ తర్వాత ఈ ప్రాజెక్టుని ఆపేశారు. అందుకు కారణాలు ఏంటి అన్నది బయటకి రాలేదు.ఓ దశలో ఈ కథని సోనూ సూద్ తో కూడా తీయాలని అనుకున్నాడు పూరీ. అయితే ఒకానొక టైమ్లో పూరీ.. మంజులని కలిసి కథ వినిపించడం.. ఆమె మహేష్ వద్దకు పూరీని పంపడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ‘నాని’ ఫ్లాప్ అవ్వడంతో భవిష్యత్తులో మంజుల బ్యానర్లో ఓ సినిమా చేస్తానని మహేష్ మాట ఇచ్చాడు.
ఆ డేట్స్ ని పూరీ ప్రాజెక్టుకి అలోకేట్ చేయించింది మంజుల. టైటిల్ తో పాటు స్క్రిప్టుల్లో కొన్ని మార్పులు కోరి ‘పోకిరి’ గా సెట్స్ పైకి తీసుకెళ్ళాడు మహేష్ బాబు. ‘అతడు’ కి ‘సైనికుడు’ సినిమాలకి మధ్య దొరికిన గ్యాప్లో ‘పోకిరి’ సినిమా చేసేశాడు మహేష్.
‘పోకిరి’ కోసం మహేష్ 45 రోజులు డేట్స్ ఇచ్చాడు. సీన్ ఎంత బాగా వచ్చినా.. వన్ మోర్ టేక్ అడిగి మరీ చేయించుకోవడం మహేష్ బాబుకి అలవాటు. కానీ ‘పోకిరి’ విషయంలో దర్శకుడు పూరీపై పూర్తిగా నమ్మకం పెట్టుకుని ముందుకు వెళ్ళాడు.
ఒకేసారి 2,3 ప్రదేశాల్లో 2,3 సీన్లు షూట్ చేసిన ఘనత పూరీ సొంతం అని చెప్పాలి.
ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మొదట కంగనా రనౌత్, ఆయేషా టాకియా(‘సూపర్’ ఫేమ్) వంటి బాలీవుడ్ భామలను హీరోయిన్లుగా అనుకున్నారు పూరీ. కానీ తర్వాత ‘దేవదాస్’ తో సూపర్ హిట్ అందుకున్న ఇలియానాని హీరోయిన్ గా ఫైనల్ చేశారు.
అలాగే తండ్రి పాత్ర కోసం పూరీ… అమితాబ్ ను సంప్రదించారు. కానీ ఫైనల్ గా నాజర్ ను తీసుకున్నారు. దాంతో బడ్జెట్ కంట్రోల్ పెట్టినట్టు అయ్యింది.
66 రోజుల్లో ‘పోకిరి’ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. 2006 జనవరిలో మొదలుపెడితే మార్చి ఎండింగ్ కి షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఏప్రిల్ 28 కి రిలీజ్ చేసేశారు.
బెనిఫిట్ షోలు వంటివి ‘పోకిరి’ కి పడలేదు. మొదటి రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. మొదటి వారం సొ సొ వసూళ్లే సాధించింది. కానీ రెండో వారంలో వచ్చిన పవన్ కళ్యాణ్ ‘బంగారం’ డిజాస్టర్ అవ్వడంతో ‘పోకిరి’ వసూళ్లు పెరుగుతూనే వచ్చాయి.
మహేష్ బాబుని అప్పటి వరకు ఇంత మాస్ గా ప్రేక్షకులు చూసింది లేదు. అది ఈ సినిమాకి మేజర్ ప్లస్ అయ్యింది అని చెప్పాలి.
సౌత్ లో రూ.40 కోట్ల షేర్ ను రాబట్టిన మొట్ట మొదటి తెలుగు సినిమాగా ‘పోకిరి’ చరిత్ర సృష్టించింది. 2009 జూలై నెలలో వచ్చిన ‘మగధీర’ వరకు ‘పోకిరి’ వసూళ్లను మించిన సినిమా రాలేదనే చెప్పాలి.
మహేష్ బాబుని సూపర్ స్టార్ గా నిలబెట్టిన సినిమా ‘పోకిరి’ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రీ రిలీజ్ లో కూడా ‘పోకిరి’ భారీ వసూళ్లు రాబట్టింది. ఒక రకంగా రీ- రిలీజ్ ట్రెండ్ ను బలోపేతం చేసింది కూడా ‘పోకిరి’ అనే చెప్పాలి. 20 ఏళ్ళైనా ‘పోకిరి’ మేనియా తగ్గలేదు అనే చెప్పాలి.