సినిమా నటులకు సినిమా తప్ప ఇంకేం ఉండదు అంటుంటారు. ఈ మాట ఎవరన్నా అంటే అందరూ నమ్మరు. ఎందుకంటే సినిమాలు లేకపోతే ఏదో పని చేసుకోవచ్చు కదా అని అంటుంటారు. అయితే ఈ మాటను ఓ స్టార్ హీరో అన్నారు. అందులోనూ ఇండస్ట్రీలో మిస్టర్ పర్‌ఫెక్ట్ అనిపించుకున్న హీరో అన్నారు అంటే కచ్చితంగా నమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ మాటను అన్నది ఎవరో కాదు. వైవిధ్యమైన కథలు, పాత్రలతో మూడు దశాబ్దాలకు పైగా బాలీవుడ్‌ను ఏలుతున్న అగ్ర కథానాయకుడు ఆమిర్ ఖాన్ (Aamir Khan).
అవును, ఆయనే ఈ మాటను అన్నది. ‘సితారే జమీన్ పర్’ (Sitaare Zameen Par) అంటూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రచారంలో ఆయన ఇప్పుడు బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ‘సితారే జమీన్ పర్’ సినిమా మీదనే నా దృష్టంతా ఉంది అని చెప్పుకొచ్చారు. ‘తారే జమీన్ పర్’ సినిమాతో ఎందరో మనసుల్ని గెలుచుకున్న ఆమిర్.. దానికి సీక్వెల్ అంశంగా ఈ సినిమాను చేసిన విషయం తెలిసిందే.
ఈ సినిమా మీద భారీ ఆశలే పెట్టుకున్నారు. ఆయన వరుస సినిమాలు ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha), ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ (Thugs of Hindostan) దారుణమైన ఫలితాలు అనుకున్న నేపథ్యంలో ఆమిర్ ఒత్తిడిలో ఉన్నాడు. మరి ‘సితారే జమీన్ పర్’ ఏం చేస్తుందో చూడాలి. ఇక అసలు విషయానికొస్తే.. తన కలల ప్రాజెక్ట్ ‘మహాభారతం’ తర్వాత నటుడిగా చేయడానికి ఇక ఏమీ లేదనే భావన నాకు కలుగుతుంది అనుకుంటున్నాను అని అన్నాడు. దీంతో ఆ సినిమానే ఆఖరా అనే డౌట్ వస్తోంది.
ఇక తన జీవితంలో నటుడిగానే ఉన్నానని, నటుడిగానే చనిపోవాలని ఉంది అని చెప్పుకొచ్చాడు ఆమిర్. ఇక ‘మహాభారతం’ సినిమా సంగతి చూస్తే.. ‘సితారే జమీన్ పర్’ సినిమా విడుదలైన వెంటనే కలల ప్రాజెక్టు ‘మహాభారతం’ సినిమా పనులు మొదలుపెడతా అని చెప్పాడు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ కథతో ప్రయాణం చేస్తున్నాను. వెండితెరపై నా ఆలోచనలను ప్రేక్షకులకు అద్భుతంగా చూపించాలని కలలు కంటున్నా అని చెప్పాడు.