టాలీవుడ్ సీనియర్ నటి హేమ (Hema) రేవ్ పార్టీ వ్యవహారం అందరికీ తెలిసిందే. బెంగళూరులోని ఓ ఫామ్ హౌస్లో రేవు పార్టీ జరిగినట్లు పోలీసులకు సమాచారం అందడంతో.. వారు రైడ్ చేశారు. అక్కడ కొంతమందిని వారు అరెస్ట్ చేయడం జరిగింది. అందులో నటి హేమ కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇంతలోనే ఆమె హైదరాబాద్లోని ఫామ్ హౌస్లో ఉన్నట్టు చెప్పి అందరినీ తప్పుదోవ పట్టించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హేమ ఫోటోని విడుదల చేసి, ఆమె కూడా రేవు పార్టీలో పాల్గొన్న వారి లిస్ట్ లో ఉందని, ఆమెను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
అయినా హేమ తగ్గలేదు. ‘నేను హైదరాబాద్లోనే ఉన్నాను.. బిర్యానీ చేస్తున్నాను’ అంటూ వీడియోలు విడుదల చేసి అందరినీ కన్ఫ్యూజ్ చేసింది. తర్వాత విచారణకి హాజరుకావాలని ఆమెకు నోటీసులు పంపితే.. ఒంట్లో బాలేదని చెప్పి ఎస్కేప్ అయ్యింది. అటు తర్వాత బూర్కాలో ఆమె బ్లడ్ టెస్టులకి వెళ్లడం కూడా అందరికీ తెలిసిందే. ఆ వివాదం జరిగిన కొన్నాళ్ల తర్వాత హేమ తిరుమలలో దర్శనమిచ్చింది. అప్పుడు కూడా రేవ్ పార్టీ గురించి తనకేమీ తెలీదు అన్నట్టు చెప్పుకొచ్చింది.
అయితే మొత్తానికి ఇప్పుడు రేవ్ పార్టీ విషయం పై ఓపెన్ అయ్యింది హేమ. తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన హేమ ఈ విషయం పై స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ” నేను రేవ్ పార్టీకి వెళ్లిన మాట నిజమే. కానీ నేను అది పార్టీ అనుకుని వెళ్ళాను. అది రేవ్ పార్టీ అని నాకు తెలీదు. నాకు తెలిసిన ఓ వ్యక్తి పుట్టినరోజు వేడుకగా భావించి నేను ఆ పార్టీకి వెళ్లడం జరిగింది. అతను నాకు సోదరుడు లాంటివాడు. శనివారం జరిగిన పార్టీలో నేను పాల్గొన్నాను.
ఆదివారం జరిగిన పార్టీతో నాకు సంబంధం లేదు. నేను బ్లడ్ శాంపిల్స్ కూడా ఇవ్వలేదు. అయినా నా గురించి ఇష్టమొచ్చినట్టు ప్రచారం చేశారు. నేను సాంప్రదాయని కాదు. ఎక్కడికైనా వెళ్తాను. నా లైఫ్ నా ఇష్టం. అడగడానికి మీరెవరు? మీకేం హక్కు ఉంది? నేను ఎలాంటి దాన్ని అనేది కోర్టు తేలుస్తుంది” అంటూ హేమ ఘాటుగా స్పందించింది.