అజిత్ నుండి సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. ఇప్పటివరకు కొత్త సినిమా ఏదీ స్టార్ట్ కాలేదు. దీంతో ఈ ఏడాదికి సినిమా రావడం అసాధ్యం. వచ్చే ఏడాది ఎప్పుడు వస్తుంది అనే క్లారిటీ ఇంకా టీమ్ ఇవ్వడం లేదు. అయితే ఇప్పుడు ఈ విషయంలో క్లారిటీ దాదాపు వచ్చేసింది. మరో రెండు Aలతో కలసి మిస్టర్ A ఇప్పుడు సినిమా చేయబోతున్నాడని కోడంబాక్కం వర్గాల టాక్. అవును, అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ నెక్స్ట్ సినిమా ఉండబోతోందని సమాచారం. ఈ సినిమాకు అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తారట.
అంతేకాదు ఈ సినిమాను అజిత్ స్వయంగా నిర్మిస్తారట. ఆగస్టులో సినిమా షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నారని.. ఈ నెలాఖరులో సినిమా ప్రకటన ఉంటుంది చెబుతున్నారు. 2025లో వచ్చిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా తర్వాత అజిత్ మరో సినిమా చేయలేదు. తన మోటో రేసింగ్ పోటీల పనుల్లో బిజీగా ఉన్నాడు. ప్రపంచదేశాల్లో తన టీమ్ తరఫున పోటీకి దిగుతూ విజయాలు సంపాదించుకుంటూ వచ్చాడు. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు అని అంటున్నారు.
అన్నట్లు ఇలా సినిమాలకు గ్యాప్ ఇచ్చినా.. కెమెరాకు దూరంగా లేడు అజిత్. ఎ.ఎల్ విజయ్ దర్శకత్వంలో తన రేసింగ్, ఇతర కార్యకలాపాల మీద ఓ డాక్యుమెంటరీ చేశారు. అజిత్ నాన్ సినిమా కంటటెంట్ ఈ డాక్యుమెంటరీ ఉండబోతోందట. తొలుత ఈ ఫిల్మ్‌ను థియేటర్లలో విడుద చేసి, ఆ తర్వాత ఓటీటీలో స్ట్రీమ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ అనుకుంటోందట. మే 1న ఈ డాక్ ఫిల్మ్‌ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ వివిధ కారణాల వల్ల అవ్వలేదు.
ఈ డాక్ ఫిల్మ్ కోసం ఏఎల్ విజయ్ దుబాయి వెళ్లి షూటింగ్ చేయించారు. ఇందులో కొందరు సినిమా సెలబ్రిటీలు కూడా కనిపిస్తారట. వారంతా అజిత్ రేస్‌ని చూడటానికి వెళ్లినవారే అని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక అప్‌డేట్ త్వరలో వెల్లడిస్తారని సమాచారం.