మొన్నీమధ్య జరిగిన ‘లెనిన్’ సినిమా సక్సెస్ ప్రెస్ మీట్‌లో ఆ సినిమా కథానాయిక భాగ్యశ్రీ భోర్సే ఎమోషనల్ అయింది. కన్నీళ్లు ఆపుకుంటూ.. గద్గద స్వరంతో ఆమె మాట్లాడుతుంటే ఆమె అభిమానులు మాత్రమే కాదు.. సగటు సినిమా ప్రేక్షకుడు కూడా బాధపడ్డాడు. ఆమె ఎందుకు కన్నీరు పెట్టుకుంది. సినిమా విజయం వచ్చిన ఆనందంలో వచ్చిన హ్యాపీ టియర్సా? లేక ఎవరైనా ఏమన్నా అంటే హర్ట్ అయ్యిందా అనేది అప్పుడు తెలియలేదు. అయితే ఇప్పుడు ఆమె చెప్పిన మాటలు వింటుంటే ఆమె కన్నీటి వెనుక చాలా పెద్ద కథే ఉంది.
మూడేళ్ల క్రితం ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ.. ఇప్పటివరకు సరైన విజయం అందుకోలేకపోయింది. అయినా వరుస అవకాశాలు అయితే వస్తున్నాయి. అయినా విజయం వస్తే బాగుండు అనే ఫీలింగ్ అయితే ఉండేది. దాని ద్వారా స్టార్ హీరోయిన్ అవుతుంది అనే మాట ఉండేది. దీంతో ‘లెనిన్’ సినిమా ఆమె కెరీర్‌కి చాలా కీలకంగా మారింది. ఆ విజయం వచ్చిన నేపథ్యంలోనే ఆమె భావోద్వేగానికి గురైంది. ఈ విషయాన్ని ఇటీవల ఆమె దగ్గర ప్రస్తావిస్తే.. కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది.
తాను పుట్టిన కొన్ని ఏళ్లకు తండ్రి ఉద్యోగం కోల్పోవడంతో తమ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొందని భాగ్యశ్రీ చెప్పింది. కుటుంబ పోషణ కోసం తన తండ్రి పడిన కష్టాలను గుర్తు చేసుకుంది. దయచేసి నాకు ఉద్యోగం ఇవ్వండి. నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు అని మా నాన్న ఒకరి దగ్గర ప్రాధేయపడటం చూశాను అని చెప్పింది. అప్పుడే ఎలాగైనా కష్టపడి డబ్బు సంపాదించి తన కుటుంబాన్ని ఆర్థికంగా ఉన్నత స్థానంలో నిలబెట్టాలనే సంకల్పం తీసుకున్నాను అని చెప్పింది.
తండ్రిని అలా చూశాక, కుటుంబాన్ని అలా చూశాక ఎవరైనా విజయం సాధించాక ఇలానే చేస్తారు. కాబట్టి భాగ్యశ్రీ కన్నీటికి, భావోద్వేగానికి సరైన కారణం ఉంది. ఆమె కోరిక నెరవేరింది.