అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి ఈ విషయాలు ఆనందంగానే ఉన్నా.. ఈ విషయంలో టాలీవుడ్ దర్శకులు మాత్రం కాస్త బాధగానే ఉన్నారు. ఎందుకంటే బన్నీ లాంటి స్టార్ హీరోతో సినిమా చేయాలని ఏ దర్శకుడికి ఉండదు చెప్పండి. ఇదంతా ఎందుకు అంటే.. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాల లైనప్ చూస్తుంటే ఇప్పట్లో ఐకాన్ స్టార్ టాలీవుడ్ దర్శకులతో సినిమా చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పట్లో అంటే రెండు, మూడేళ్లు కాదు.. ఏకంగా ఎనిమిదేళ్లు అని చెప్పొచ్చు. కారణం ఆయన నెక్స్ట్ నాలుగు సినిమాలు ఇతర భాషల దర్శకులతోనే ఉన్నాయి.
కావాలంటే మీరే చూడండి రెండేళ్ల క్రితం చేసిన ‘పుష్ప: ది రూల్’ తర్వాత మరో టాలీవుడ్ దర్శకుడితో బన్నీ సినిమా చేయలేదు. ప్రస్తుతం అట్లీతో ‘రాకా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలవుతుంది అంటున్నారు. ఇంకా ఎక్కడా అధికారికంగా విడుదల తేదీ ప్రకటించలేదు. డిసెంబరు 2027 అన్నారంతే. ఆ తర్వాత లోకేశ్ కనరాజ్‌తో సినిమా చేస్తానని బన్నీ ఇప్పటికే అనౌన్స్ చేశాడు. ఈ సినిమా ‘రాకా’ అయ్యాకనే స్టార్ట్ చేస్తారు. 2028లో కానీ, 2029 ప్రారంభంలో కానీ ఈ సినిమా రిలీజ్ అవ్వొచ్చు.
రీసెంట్ రూమర్స్ ప్రకారం అయితే.. బన్నీ ఆ తర్వాత చేయబోయే సినిమా మాలీవుడ్ దర్శకుడు బసిల్ జోసెఫ్‌తో ఉండొచ్చు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆఖరులో సెట్స్‌పైకి రావొచ్చు అంటున్నారు. సూపర్ హీరో కథ అంటున్నారు కాబట్టి ఈ సినిమాకు ఒకటిన్నర లేదా రెండేళ్లు పట్టొచ్చు. ఈ సినిమా అయ్యాక అయినా బన్నీ తెలుగు దర్శకులకు అందుబాటులోకి వస్తాడా అంటే.. ఆ వెంటనే బాలీవుడ్ దర్శకుడితో సినిమా చేస్తాడు అని చెబుతున్నారు. మరి అదెన్నేళ్లు పడుతుంది. ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి. ఈ లెక్కన ఇంత త్వరగా అల్లు అర్జున్ తెలుగు దర్శకులకు అందుబాటులో ఉండడు అని చెప్పాలి.