‘గేమ్ ఛేంజర్’ సినిమా గురించి మీడియాలో ఇప్పటికీ ఏదో ఒక టాపిక్ రన్ అవుతూనే ఉంది. ‘గేమ్ ఛేంజర్’ కి పనిచేసిన వాళ్ళలో ఎవరోకర్ని ఇంటర్వ్యూ చేయాల్సి వస్తే.. కొంతమంది పనిగట్టుకుని ‘ఆ సినిమా గురించి ఏదో ఒక ప్రశ్న వేసి వైరల్ అవ్వాలని చూస్తున్నారు.
ఇప్పుడు కూడా అలాంటిదే జరిగింది. ‘పెద్ది’ సినిమాలో రాసిన ‘రై రై రారా’ పాట చార్ట్ బస్టర్ అవ్వడంతో లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్(Anantha Sriram) ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈయన ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో కూడా ‘రా మచ్చ మచ్చ’ ‘జరగండి జరగండి’ వంటి పాటలు రాశారు.
దీంతో ఇంటర్వ్యూ చేసే వ్యక్తి…” ‘ఈ మధ్యకాలంలో చూసుకుంటే మీరు ‘గేమ్ ఛేంజర్’లో ఒకటి, రెండు పాటలు రాశారు. అందులో ‘జరగండి జరగండి’ అనే పాటలో ‘జాబిలమ్మ జాకెట్టేసుకొచ్చెనండి’ అనే పదం దగ్గర చాలా మంది… ‘అనంత శ్రీరామ్ … ఇంతకన్నా గొప్పగా రాయగలడు కదా’ అని అనుకున్నారు’ అంటూ ఆ రిపోర్టర్ అనంత్ శ్రీరామ్ ని ప్రశ్నించడం జరిగింది. అందుకు అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ.. “జాకెట్ వేసుకొచ్చిందనే రాశాను కదా, జాకెట్ తీసుకువచ్చిందని రాయలేదు కదా..!
ఒక్కొక్కరిది ఒక్కో మాస్ అభిరుచి. నాకైతే ఆ పదం ఇష్టం. ఆ పాట మొత్తం ఇష్టం. ఎందుకంటే ‘జరగండి జరగండి’, ‘జాబిలమ్మ జా’, ‘జాకెట్ జా’… ఇలా యతిప్రాసలు అద్భుతంగా కుదిరిన లైన్లు ఎప్పుడూ రచయితకు ఒక రకమైన కిక్ ఇస్తాయి.ఆధునిక యుగంలో జాకెట్ అంటే అది ఒక జెర్కిన్ లాంటిది. నేను ఆ ఉద్దేశంతోనే రాశాను. ఎందుకంటే ఆ పాటలో ఎలాన్ మస్క్, కలాష్నికోవ్, సూపర్ సోనిక్, హైపర్ సోనిక్… ఇలా అంతా ఇప్పటి భాషనే ఉంటుంది.
ఆ జాకెట్ కూడా ఇప్పటి భాషే. మరి శ్రోతలు ఏ జాకెట్ అనుకున్నారో నాకు తెలియదు. అనుకున్నా కూడా..! నేను ‘జాకెట్ వేసుకొచ్చింది’ అనే రాశాను కానీ ‘తీసుకొచ్చింది’ అని రాయలేదు కదా!” అంటూ సమర్ధించుకున్నారు.