పద్మశ్రీ అవార్డు గ్రహీత, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఓ పెళ్లి వేడుకలో సెల్ఫీ అడిగిన పిల్లాడిని తోసేసిన సంఘటన మరువకముందే.. ఆయన మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు.
తాజాగా ఈయన లెజెండరీ నటుడు, తమిళుల ఆరాధ్య దైవం ఎంజీఆర్ (MGR)పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
అసలేం జరిగిందంటే.. హైదరాబాద్‌లో ఇటీవల ‘కళా ప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డు-2025’ ప్రదానోత్సవం జరిగింది. ఈ వేడుకలో రాజేంద్ర ప్రసాద్‌కు అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా స్టేజ్ పై మాట్లాడిన ఆయన.. కాంతారావు గొప్పదనాన్ని వివరించే క్రమంలో ఎంజీఆర్‌ను ఉద్దేశించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. “స్టేజీపై కాంతారావు జానపద వేషం వేస్తున్నాడంటే ఎంజీఆర్ ఉచ్చ పోసుకునేవాడు.. కాంతారావు పేరు చెబితేనే అమ్మ బాబోయ్ అంటూ భయపడిపోయేవాడు” అంటూ ఒకటికి రెండుసార్లు ప్రస్తావించారు.
ఒక గొప్ప నటుడిని పొగడటానికి.. మరో రాష్ట్ర ప్రజలు దేవుడిలా ఆరాధించే ఎంజీఆర్ లాంటి లెజెండ్‌ను ఇలా చులకన చేస్తూ మాట్లాడటం ఏంటని తమిళులు మండిపడుతున్నారు. పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌పై తోటి నటుడి పట్ల కనీస గౌరవం లేకుండా రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి భాష వాడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంజీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను ఆయన వెంటనే వెనక్కి తీసుకుని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక గతంలో బ్రహ్మానందం, అలీ లాంటి సహనటులపైనా రాజేంద్ర ప్రసాద్ ఇలాగే నోరు జారి విమర్శల పాలయ్యారు. ఇప్పుడు ఎంజీఆర్ విషయంలో చేసిన కామెంట్స్ ఏకంగా పక్క రాష్ట్రంలో రచ్చ రేపుతుండటంతో.. ఈ ఇష్యూపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.