Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

పుట్టినప్పటి నుండీ తమ కుమారుడిని ఒక గొప్ప దర్శకుడిగా చూడాలని కలలు కన్న తల్లిదండ్రులకు, ఊహించని విధంగా కెమెరానే తన ప్రపంచంగా ఎంచుకుని, తనకేం కావాలో, తన లక్ష్యం ఏమిటో స్వయంగా నిర్ణయించుకున్న యువ ప్రతిభాశాలి భువన్ విక్రమాదిత్య కొట్టాల(Bhuvan Vikramadithya). 3 ఏళ్ళ వయసులోనే ‘రుణం’ చిత్రంతో పాటు మరికొన్ని లఘు చిత్రాల్లో నటించి కెమెరా ముందుకు వచ్చిన భువన్, ఐదేళ్ల వయసు నుంచే కెమెరాతో ప్రయోగాలు చేయడం ప్రారంభించారు.

Bhuvan Vikramadithya

చిన్ననాటి ఆ ఆసక్తే క్రమంగా అభిరుచిగా, ఆ అభిరుచే లక్ష్యంగా మారి నేడు ఆయనను సినిమాటోగ్రాఫర్ స్థాయికి తీసుకువచ్చింది. తల్లిదండ్రులు తనను దర్శకుడిగా చూడాలని ఆశించినప్పటికీ, తనకు నిజమైన ఆనందం కెమెరా వెనుకే ఉందని గుర్తించిన భువన్, సినిమాటోగ్రఫీని తన వృత్తిగా ఎంచుకున్నారు. చిన్న వయసులోనే ఫ్రేమింగ్, లైటింగ్, కెమెరా యాంగిల్స్, విజువల్ స్టోరీటెల్లింగ్ వంటి అంశాలపై ఆసక్తి పెంచుకుంటూ తన ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నారు.

కేవలం 16 ఏళ్ల వయసులోనే పూర్తిస్థాయి చలనచిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా బాధ్యతలు చేపట్టడం ఆయన సినీ ప్రయాణంలో ఒక ప్రత్యేక మైలురాయి. సహజంగా తనకున్న సృజనాత్మక నైపుణ్యానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి, సినిమాటోగ్రఫీలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో, భారతదేశంలోని ప్రముఖ సినీ విద్యాసంస్థల్లో ఒకటైన చెన్నైలోని ఎల్.వి. ప్రసాద్ కాలేజ్ ఆఫ్ మీడియా స్టడీస్‌లో చేరారు.

అక్కడ సినిమాటోగ్రఫీకి సంబంధించిన ఆధునిక సాంకేతిక అంశాలను అభ్యసిస్తూ, తన అనుభవానికి వృత్తిపరమైన శిక్షణను జోడించుకుంటున్నారు. సహజ ప్రతిభకు సాంకేతిక నైపుణ్యం తోడైతే సృజనాత్మకతకు మరిన్ని అవకాశాలు లభిస్తాయనే ఆలోచనతో తన సినీ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ‘వెంకటలక్ష్మితో యాడాది కిందట’ అనే సైకలాజికల్ సస్పెన్స్ మ్యూజికల్ లవ్ థ్రిల్లర్ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

కెమెరా వెనుక నిలబడి కథకు అందమైన దృశ్యరూపాన్ని అందించడమే కాకుండా, ఎడిటింగ్ ద్వారా కథనంలోని భావోద్వేగాలను, ఉత్కంఠను ప్రేక్షకులకు మరింత ప్రభావవంతంగా చేరవేయడానికి తన వంతు కృషి చేశారు. దర్శకుడిని చేయాలనుకున్న తల్లిదండ్రుల కల నుంచి… తనకంటూ ఒక ప్రత్యేకమైన సినిమాటోగ్రఫీ ప్రపంచాన్ని నిర్మించుకోవాలనే లక్ష్యం వరకు సాగిన భువన్ ప్రయాణం, చిన్న వయసులోనే తన అభిరుచిని గుర్తించి ముందుకు సాగాలనుకునే యువతకు స్ఫూర్తిదాయకం.

18 ఏళ్ల వయసులోనే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వంటి రెండు కీలక విభాగాల్లో తన ప్రతిభను చాటుకుంటున్న భువన్ విక్రమాదిత్య కొట్టాల, ఇప్పుడు తన సహజ నైపుణ్యానికి ప్రొఫెషనల్ ఫిల్మ్ ఎడ్యుకేషన్‌ను జోడించుకుంటూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించే దిశగా అడుగులు వేస్తున్నారు. కలలు కనేది తల్లిదండ్రులైనా… తన కలను తానే ఎంచుకుని, కెమెరానే తన భవిష్యత్తుగా మలుచుకున్న యువ ప్రతిభ భువన్ విక్రమాదిత్య కొట్టాల! యువ ప్రతిభను ప్రోత్సహిద్దాం… భువన్ విక్రమాదిత్య కొట్టాలకు అభినందనలు తెలియజేద్దాం!

ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus