ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్‌తో యంగ్ డైరక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘జైలర్ 2’. ఈ సినిమాకు సంబంధించి ఆ మధ్య కాస్త బజ్ తగ్గింది అనుకుంటుండగా.. సినిమా ప్రచరాన్ని షురూ చేసి తలైవా సత్తా ఏంటి అనేది చూపించారు. ఈ క్రమంలో ఈ సినిమా మీద ఓ కాపీ మరక పడింది. అయితే అది కాపీనా? లేక స్ఫూర్తినా అనేది త్వరలో తేలుతుంది. ముందు ఆ మరక ఏంటి అని అడుగుతారా.. అది ‘బ్రేకింగ్ బ్యాడ్’.
నెల్సన్ దిలీప్ కుమార్‌ని ఫాలో అయ్యేవారికి ‘బ్రేకింగ్ బ్యాడ్’కి ఆయనకు ఉన్న రిలేషన్ ఏంటి అనేది కూడా తెలుసు. అందుకే తనకు బాగా నచ్చిన సిరీస్ విషయంలో ఎక్కువ స్ఫూర్తి పొందేశారా అనే చర్చ కోలీవుడ్ వర్గాల్లో మొదలైంది. దానికి కారణం ‘జైలర్ 2’ సినిమా ట్రైలర్‌లోని కొన్ని షాట్‌లు ‘బ్రేకింగ్ బ్యాడ్’తో పాటు ‘బెటర్ కాల్ సాల్’ సీన్లను చూసినట్లుగా ఉన్నాయి అనే కామెంట్లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
టైగర్ ముత్తువేల్ పాండియన్ – వాల్టర్ వైట్ పోలికను ట్రైలర్ చూసి చెప్పొచ్చు. రజనీకాంత్ ఈ సినిమా పోషించిన టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రను చూపించిన బ్యాక్‌గ్రౌండ్‌లో మంటలు, సీరియస్ లుక్స్ షాట్స్.. ‘బ్రేకింగ్ బ్యాడ్’ సిరీస్‌లో బ్రయాన్ క్రాన్‌స్టన్ చేసిన వాల్టర్ వైట్ ఐకానిక్ సీన్లను గుర్తుచేస్తున్నాయి. అలాగే విలన్లు, డార్క్ కామెడీ, సైలెంట్ యాక్షన్ ‘బ్రేకింగ్ బ్యాడ్’, ‘బెటర్ కాల్ సాల్’ని పోలినట్లే ఉంటాయి.
‘బ్రేకింగ్ బ్యాడ్’ సిరీస్ 2008 నుండి 2013 వరకు చాలా ఫేమస్. ‘బెటర్ కాల్ సాల్’ అయితే 2015 నుండి 2022 వరకు ఫేమస్. మరి ఈ రిఫరెన్స్‌లు లుక్‌లు, షాట్ల వరకే ఆగిపోయాయా లేక కథలో కూడా వచ్చాయా అనేది తేలాలి అంటే అక్టోబరు 15 రావాల్సిందే.. ఆ రోజున థియేటర్లలో టైగర్ ముత్తువేల్ పాండియన్‌ని చూడాల్సిందే. ‘జైలర్’ సినిమాకు రూ.600 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాకు ఎంత వసూళ్లు వస్తాయో చూడాలి.