సినిమా హీరోలకు అభిమానులు లేదంటే అభిమానుల పేరి వారే ఓ బిరుదు పెట్టుకుంటారు. ఇక్కడ, అక్కడ అనే తేడా లేకుండా దాదాపు ఇండియన్ సినిమాలో అందరు హీరోలకు ఇలాంటి పేరు ఒకటి ఉంటుంది. అయితే, ఆ బిరుదును మార్చుకునే హీరోలు కూడా ఉన్నారు. కొంతమంది మార్చుకుని, తిరిగి పాత బిరుదుకు వచ్చేవాళ్లూ ఉన్నారు. ఇంకొందరు ఈ సినిమాకు నాకు బిరుదు వద్దులెండి అని తీయించేసినవాళ్లూ ఉన్నారు. అలా ఓకే అనుకున్న బిరుదును సినిమా టైటిల్ కార్డుల్లో వేస్తుంటారు.
ఇప్పుడు ఈ బిరుదు చర్చ ఎందుకు అనుకుంటున్నారా? పైన చెప్పిన కాన్సెప్ట్‌లో బిరుదు సంపాదించిన హీరో.. తన నెక్స్ట్ సినిమా టైటిల్ కార్డ్స్‌లో ఆ బిరుదు వదిలేశారు. ఇలా గతంలో కూడా కొంతమంది చేశారు కదా అనుకుంటున్నారా.. ఇక్కడ బిరుదు వదిలేయడం కాదు.. దాని బదులు పెట్టుకుంటున్న పేరు. ఆ హీరో ఎవరు అనేది చెబితే.. కొత్తగా వచ్చిన పేరేంటో మీరే చెప్పేస్తారు. ఆ హీరోనే తమిళ స్టార్ హీరో విజయ్ జోసెఫ్ అలియాస్ దళపతి విజయ్.
విజయ్ హీరోగా హెచ్.వినోద్ తెరకెక్కించిన చిత్రం ‘జన నాయగన్’. సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా సెన్సార్ చిక్కులు, లెక్కలు దాటుకుని ఇప్పుడు రిలీజ్ అవుతోంది. జులై 24న సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా అయితే ప్రకటించలేదు. అయితే సెన్సార్ అప్‌డేట్‌లు అయితే ఇస్తున్నారు. ఈ క్రమంలో సినిమా టైటిల్ కార్డు బయటకు వచ్చింది. అందులో విజయ్ పేరు పైన దళపతి అని కాకుండా THE HONOURABLE CHIEF MINISTER OF TAMIL NADU. C JOSEPH VIJAY అని రాయడం గమనార్హం.
ఓ హీరో సీఎం అయ్యాక సినిమా రిలీజ్ అవ్వడం, ఆ సినిమా టైటిల్ కార్డులో సీఎం అని రావడం ఇదే తొలిసారి అని సమాచారం. గతంలో నందమూరి తారక రామారావు ఇలా సీఎం అయ్యాక సినిమాలు వచ్చాయి. కానీ వాటి టైటిల్ కార్డులో సీఎం అని రాలేదు అని సమాచారం.