విజయాన్ని మించిన గౌరవం లేదు.. విస్మరణకు మించిన రివేంజ్ లేదు అంటారు. దీన్ని ఎవరు ఎలా వాడుకున్నా వాడుకోకపోయినా సినిమా పరిశ్రమలో పక్కాగా వాడుతూ ఉంటారు. సరైన విజయం దాకా... అప్పటివరకు తమను విస్మరించిన వారికి సరైన కౌంటర్ ఇస్తూ ఉంటారు. ఇది నటులు – సాంకేతిక నిపుణులు, నటులు – నటులు మధ్య జరుగుతూ ఉంటుంది. అలాగే నటులు – మీడియా ముందు కూడా అవుతుంటుంది. ఇప్పుడు ‘ధురంధర్’ సినిమా టీమ్ అదే పని చేసింది. తమ సినిమా గురించి, తమ కష్టం గురించి తక్కువ చేసి మాట్లాడిన ఓ మీడియా సంస్థకు ఝలక్ ఇచ్చింది.
ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్‌కు చెందిన ఇండియన్ పురస్కారాల కార్యక్రమం ఇటీవల జరిగింది. ఆ కార్యక్రమానికి బాలీవుడ్ నుండి పెద్ద పెద్ద సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇలాంటి ఈవెంట్లకు వచ్చి బ్రాండ్, ఇమేజ్ పెంచుకోవాలని నటులు, సాంకేతిక నిపుణులు చూస్తూ ఉంటారు. అయితే ‘ధురంధర్’ సినిమా టీమ్ రాలేదు. తమ సినిమాకు ఇప్పుడు ప్రచారం అక్కర్లేదు అనుకొని ఆ టీమ్ రాకుండా ఉండలేదు. గతంలో వారి సినిమా గురించి ఆ మ్యాగజైన్ ఎడిటర్ పూర్తి నెగెటివ్‌గా రివ్యూ ఇచ్చారు.
ఆ సినిమాను, టీమ్ కష్టాన్ని, వసూళ్లను పొగుడుతూ కార్యక్రమం హోస్ట్ సినిమా టీమ్‌ని అనౌన్స్ చేసింది. తీరా చూస్తే ఆ రోజు ఎవరూ రాలేదు. ఎందుకా అని చూస్తే.. ఆ సినిమాను యాంటీ పాకిస్థాన్ కంటెంట్‌గా ఆ మ్యాగజైన్ ఎడిటర్ తన రివ్యూలో రాసుకొచ్చారు. అయితే ఆ తర్వాత ఆ రివ్యూ మీద విమర్శలు రావడంతో ఆ వీడియోను డిలీట్ చేసేశారు. కానీ ఈ విషయాన్ని సినిమా టీమ్ సీరియస్‌గా తీసుకొంది. మన దేశానికి గర్వంగా అనిపించేలా తీసిన సినిమాను అలా తక్కువ చేసేలా రాయడం సరికాదు అనేది ఆ సినిమా టీమ్ ఉద్దేశం. అందుకే అలా విస్మరణ బదులు ఇచ్చింది..