Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌.. రంగంలోకి ఎడిటర్స్‌ యూనియన్‌.. ఏమైందంటే?

Advertisement

ప్రముఖ తమిళ కథానాయకుడు విజయ్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘జన నాయగన్‌’. సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్‌ చిక్కుల కారణంగా కోర్టు మెట్లు ఎక్కి, దిగింది. ఈ లోపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రావడంతో సినిమా ప్రస్తుతం హోల్డ్‌లో ఉంది. ఈ లోపు ఎవరో సినిమాను లీక్‌ చేసేశారు. పూర్తి క్వాలిటీతో ఈ సినిమా ప్రింట్ సోషల్‌ మీడియాలోకి వచ్చేసింది. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వ్యవహారంలో చాలామంది పేర్లు వినిపింంచాయి.

Jana Nayagan

ఈ క్రమంలో సినిమా ఎడిటర్‌ ప్రదీప్‌ ఇ. రాఘవ్‌ పేరు కూడా చర్చలోకి వచ్చింది. ‘జన నాయగన్‌’ సినిమా లీక్‌కు కారణం ఆయనే కారణం అంటూ గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని ఎడిటర్స్‌ యూనియన్‌ ఖండించింది. ఈ ఘటనతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టత ఇచ్చింది. గ్రాఫిక్స్‌, సౌండ్ మిక్సింగ్‌ను మెరుగు పరిచేందుకు సినిమా కాపీని జనవరిలోనే దర్శకుడు, నిర్మాతల అనుమతితో హైదరాబాద్‌లోని ఓ స్టూడియోకి ప్రదీప్‌ పంపారని తెలిపింది. ఆయన లీక్‌ చేయాలనుకుంటే వాటర్‌మార్క్‌ లేకుండానే చేసేవారు కదా అని ప్రశ్నించింది.

ఇదిలా ఉండగా చిత్రబృందం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆరుగురుని అరెస్ట్‌ చేశారు. ఈ విషయాన్ని చిత్రబృందం లాయర్‌ పోస్ట్‌ ద్వారా తెలిపారు. సినిమాను లీక్‌ చేసినందుకు సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసింది. లీకైన సీన్‌లను సోషల్‌ మీడియా ద్వారా ఏ రూపంలో డౌన్‌లోడ్‌ చేసినా, షేర్‌ చేసినా వారిపైనా చర్యలు తీసుకుంటాం. పైరసీ వీడియోలను ఫార్వర్డ్‌ చేసిన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకుంటాం అని ‘జన నాగయన్‌’ లాయర్‌ నోటీసులు విడుదల చేశారు. ఈ మేరకు కొన్ని డిజిటల్‌ పరికరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.

ఇక సినిమా లీక్‌ విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రికి ఓ ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన ఈ విషయంలో నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నారు. మీ కుటుంబానికి చెందిన వారే ఈ సినిమా లీక్‌ చేశారని టీవీకే జనరల్‌ సెక్రటరీ ఆధవ్‌ అర్జున అంటున్నారు కదా అని అడగ్గా ‘అవునా.. నాకు తెలియదు. ఆధవ్‌ అర్జున గురించి వచ్చిన వార్తలు నేను చదవలేదు’ అని సీఎం స్టాలిన్‌ బదులిచ్చారు.

శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus