కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు.. ఈ సినిమా డైలాగ్‌ను సినిమాలకే ఆపాదిస్తే.. ‘కంటెంట్ మీద నమ్మకం తక్కువ ఉన్నప్పుడు కాంట్రవర్శీ చాలు’ అని మార్చొచ్చు. ఇది ఏ ఒకరినో ఉద్దేశించి అన్న మాట కాదు. ఇప్పటివరకు టాలీవుడ్‌లో జరిగిన సినిమా కాంట్రవర్శీలు, ఆ తర్వాత ఆ సినిమాలు పొందిన లాభాలు చూసి అన్నమాట ఇది. ఇక్కడ పేర్లు చెప్పం కానీ.. యువ హీరోలు.. యువ స్టార్ హీరోలు, యువ ప్రామిసింగ్ హీరోలుగా మారడానికి ఈ స్టైల్‌ని బాగానే వాడేశారు.
ఇప్పుడు ఎందుకు ఈ చర్చ అనుకుంటున్నారా? ఇప్పుడు టాలీవుడ్‌లో రిలీజ్‌కి రెడీ అవుతున్న ఓ సినిమాకు సంబంధించి ఇదే మాట వినిపిస్తోంది. సమాజంలో చర్చని లేవనెత్తే సినిమా ఇది. ఎంతగా చర్చ జరిగితే మా సినిమాకి అంత మంచిది. ట్రైలర్ విడుదలైన వెంటనే మా సినిమాపై చర్చ మొదలైంది. అది మంచిదే. ఒక రకంగా ట్రైలర్‌తో మేం ప్రేక్షకుల్ని ముందుగానే సిద్ధం చేశాం అని హీరో ఆ సినిమా గురించి ఇటీవల మాట్లాడారు. ఈ మాటల వెనుక అర్థం డిస్కషన్ ఆ తర్వాత ఫుట్‌ఫాల్సే అని అర్థమవుతోంది.
ఇక ఆ సినిమా నిర్మాత అయితే.. సినిమాలో ప్రేక్షకులు ఊహించని విషయాలు, షాకులు మరిన్ని ఉంటాయనేలా మాట్లాడారు. ప్రేక్షకులను ముందే ప్రిపేర్ చేసే ప్రయత్నం ఇది అనిపిస్తోంది. ఈ సినిమాకు రెగ్యులర్ సినిమాల తరహా ముగింపు ఉండదని చెప్పిన నిర్మాత.. సినిమా ఉన్నట్లుండి, ఆగిపోయినట్లు అనిపిస్తుందని, ప్రేక్షకులు అనుకున్నట్లుగా క్లైమాక్స్ ఉండదని చెప్పారు. అలాగే కాస్త ‘అతి’ డైలాగ్‌లు అనిపించుకున్నవి సినిమాలో ఇంకా బాగుంటాయి అని కూడా చెప్పారు.
ఈ సినిమాలోని సీన్స్, మాటలు ఇప్పటివరకు ఎక్కడా చూసి ఉండరని.. అంత సహజంగా తీశారని కూడా ఆ నిర్మాత చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే సినిమా విడుదల తర్వాత ‘బేబీ’ తరహా చర్చ, రచ్చ అయితే పక్కా అనిపిస్తోంది. మరి ఏమవుతుందో చూడాలి.