ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ కేక్ గా మారిన హీరో ఎన్టీఆర్. వరుసగా యంగ్ టైగర్ సినిమాలు విజయం సాధిస్తుండటంతో అతని డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తారక్ కి చెప్పిన కథ నచ్చిందని టాక్ రావడంతో, ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్రొడ్యూసర్లు ఎవరికి వారు ప్రయత్నాలు మొదలెట్టారు. జనతాగ్యారేజ్ ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ వారు మళ్లీ ఎన్టీఆర్ సినిమాకు ప్రొడ్యూస్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. హీరో తో సంప్రదింపులు చేస్తున్నారు. అలాగే త్రివిక్రమ్ తో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అ..ఆ సినిమాలు తీసిన నిర్మాత రాధా కృష్ణ డైరక్టర్ వైపు నుంచి అడుగులు వేస్తున్నారు. వీరి మధ్యలోకి తాజాగా మరో నిర్మాత ఎంటరయ్యారు.
అతనే బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్. ఈయన ఎన్టీఆర్ హీరోగా”నాన్నకు ప్రేమతో” సినిమా నిర్మించగా, త్రివిక్రమ్ తో కలిసి అత్తారింటికి దారేది తెరకెక్కించారు. దీంతో బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ కి ఇటు హీరో తోను, డైరక్టర్ తోను మంచి సంబంధాలున్నాయి. ఈ రిలేషన్ ని ఉపయోగించుకొని వీరిద్దరి కాంబినేషన్లో మూవీ నిర్మించే ఛాన్స్ పట్టేయాలని ఆయన చూస్తున్నారు. ఈ ముగ్గురి కంటే ముందు వరుసలో హీరో, నిర్మాత కళ్యాణ్ రామ్ ఉన్నారు. ఎందుకంటే తారక్ గతంలో జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నటిస్తానని చెప్పారు. మరి ఈ నలుగురి నిర్మాతల్లో ఎన్టీఆర్ ఎవరిని ఎంచుకుంటారో త్వరలో తెలియనుంది.