ఒక సినిమా షూటింగ్ అయిపోయిందని గుమ్మడికాయ కొడతారు.. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తూ ఉంటారు. ఇది గత కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది. ఎడిట్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే.. కొన్ని సీన్లు రీషూట్ చేస్తారు. దీన్ని ప్యాచ్ వర్క్ అంటుంటారు. అయితే ఒక సినిమాకు కొబ్బరికాయ కొట్టిన ఆరు నెలల తర్వాత క్లైమాక్స్‌ను మళ్లీ షూట్ చేశారు అంటే నమ్ముతారా? అంతే కాదు ఆ క్లైమాక్స్ సినిమాకు ఆయువుపట్టుగా నిలిచి, విజయానికి తోడ్పడింది అంటే నమ్ముతారా?
కానీ. ఇది జరిగింది. ఎప్పుడో కాదు రీసెంట్‌గానే. పైన చెప్పిందంతా సూర్య లేటెస్ట్ హిట్ మూవీ ‘కరుప్పు’/ ‘వీరభద్రుడు’ సినిమా గురించే. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇటీవల విడుదలైన తమిళ నాట మంచి విజయం అందుకుంది. ఈ సినిమా గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హీరో సూర్య మాట్లాడారు. దీంతో ఆర్జే బాలాజీ ఈ ఆలోచన ఆలస్యంగా వచ్చినా కరెక్ట్‌గానే వచ్చింది అంటూ మెచ్చేసుకుంటున్నారు సూర్య అభిమానులు. ఎందుకంటే ఆ క్లైమాక్స్ సీన్‌లో సూర్య తన నటనతో ఇరగదీశాడు మరి.
‘కరుప్పు’ సినిమా షూటింగ్ ముగించుకుని తర్వాతి సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా పనుల్లో సూర్య బిజీగా ఉన్న సమయంలో ఓసారి ఆర్జే బాలాజీ మాట్లాడారట. తమ సినిమా క్లైమాక్స్ విషయంలో అంత సంతృప్తిగా లేనని, కొత్త ఆలోచనతో మరోసారి షూట్ చేద్దామని చెప్పారట. అలా కొత్త ఆలోచన చెప్పారట. సినిమా ఎడిటింగ్ కూడా పూర్తయిపోయిన తర్వాత బాలాజీ అలా చెప్పడంతో సూర్య కాస్త ఆశ్చర్యపోయాడట.
ఆ వెంటనే చెన్నై వెళ్లి రెండు రోజులు షూటింగ్ పెట్టుకుని ఆ క్లైమాక్స్ షూట్ చేశారట. ఇప్పుడు థియేటర్లలో చూసి క్లైమాక్స్ అదే. ఇప్పుడు చెప్పండి ఈ సినిమాకు రీషూట్ ఎంతగా ఉపయోగపడిందో..