‘దేవర’ సినిమా భారీ విజయం అందుకున్నా.. ‘దేవర 2’ సినిమా విషయంలో చిత్రబృందం నమ్మకంగా లేదు. అందుకే ఆ సినిమా హీరో, దర్శకుడు వేర్వేరు ప్రాజెక్ట్‌లు ఎంచుకున్నారు. అయితే ‘దేవర 2’ సినిమా ఆగింది, ఆగలేదు అనే మాట మాత్రం చెప్పలేదు. కొంతమంది ఆ సినిమా ఇక లేనట్లే అని చెబుతుంటే.. మరికొంతమంది ఆ సినిమా ఉంది అని అంటున్నారు. ఇప్పుడు సినిమా టీమ్ చేస్తున్న పనులు పూర్తయితే ఈ సినిమాను పట్టాలెక్కిస్తారు అని చెబుతున్నారు.
‘ఇదేం ట్విస్ట్.. ఆ సినిమా ఇక లేనట్లే అని అందరూ అంటుంటే మీరు ఆ సినిమా పట్టాలెక్కుతుంది అని అంటున్నారేంటి?’ అనుకుంటున్నారా? యస్ మీరన్నది కరెక్టే.. కానీ కొరటాల శివ సైడ్ నుండి ఈ సినిమా ఇంకా ఉంది అనే మాటలే వస్తున్నాయి. ‘దేవర’ సినిమా కథను అక్కడితో ఆగిపోవడం సరికాదు.. ఎలాగైనా ఆ సినిమాకు ముగింపు ఉండాల్సిందే అని కొరటాల అండ్ కో. అనుకున్నారట. అందుకే ఓవైపు బాలకృష్ణ సినిమా కథ పనులు చూస్తూనే.. మరోవైపు ‘దేవర 2’ పనులు కూడా చేస్తున్నారట.
అయితే, ఈ విషయంలో ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. ఎందుకంటే ‘దేవర’ ఫలితం విషయంలో రిలీజ్ నిర్మాత నాగవంశీ రూ.600 కోట్లు పోస్టర్ వేసినా.. ఫలితం విషయంలో ఎన్టీఆర్ అంత సంతృప్తిగా లేడని సమాచారం. ఈ నేపథ్యంలోనే ‘దేవర 2’ విషయంలో ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. అయితే తొలి భాగంపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పేలా రెండో ‘దేవర’ కథ రాసుకుని కొరటాల వస్తే కచ్చితంగా సినిమా చేస్తారు.
ఎందుకంటే కొరటాల శివ మీద తారక్‌కి ఇప్పటికీ నమ్మకం ఉంది. ఆయన ఇచ్చినంత పెద్ద హిట్‌లు తారక్ కెరీర్‌కి చాలా సపోర్టుగా నిలిచాయి. ఒకవేళ ‘దేవర 2’ తీస్తే ఈసారి నిర్మాణ సంస్థ కూడా మారుతుంది అని చెబుతున్నారు. అదే జరిగితే రిలీజ్ నిర్మాత కాస్తా నిర్మాత అవ్వొచ్చట.