‘పెద్ది’ సినిమా విజయం సాధించాలని ఎంతమంది కోరుకున్నారో తెలియదు కానీ.. సినిమాలో కాస్త స్టఫ్ తక్కువ ఉందని తెలిసేసరికి మొత్తం యాక్టివేట్ అయిపోయారు. సినిమా బాలేదు అంటూ ప్రచారం హోరెత్తించారు. ఇది తప్పా? అంటే ప్రతి పెద్ద హీరో సినిమా వచ్చినప్పుడు ఇంకో పెద్ద హీరో ఫ్యాన్స్, నెటిజన్లు ఇదే పని చేస్తున్నారు. అందుకే ఒకప్పటిలా ఇప్పుడు యావరేజ్, వన్ టైమ్ వాచబుల్ లాంటి టాక్‌లు వినిపించడం లేదు. ఇప్పుడు ‘పెద్ది’ విషయంలో ఇదే ప్రయత్నం జరిగింది. అయితే వసూళ్లు బాగానే వచ్చాయి అని టీమ్ చెబుతోంది.
ఇదిలా నడుస్తుండగా.. టాలీవుడ్ సోషల్ మీడియా వర్గాల్లో ఓ ఆసక్తికర చర్చ మొదలైంది. అదే ‘పెద్ది’ సినిమాకు ఇచ్చిన రెమ్యూనరేషన్‌ను రామ్ చరణ్ వెనక్కి ఇచ్చేస్తున్నాడు అని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ.. సినిమాకు ఇబ్బందికర ఫలితం వచ్చింది అనే టాక్ వస్తున్న నేపథ్యంలో ‘రెమ్యూనరేషన్ వెనక్కి’ అనే మాట నమ్మబుల్‌గా అనిపిస్తోంది. సినిమాకు కోసం చరణ్ మూడు అంకెల పారితోషికం తీసుకున్నాడు అనే మాట తెలిసిందే. అందులో సగం వెనక్కి ఇచ్చేశాడు అని.
మరి నిజంగానే చరణ్ డబ్బులు వెనక్కి ఇచ్చేశాడా? ఇస్తే అధికారికంగా చెబుతారా అనేదే ఇప్పుడు పాయింట్. మామూలుగా అయితే ఇలాంటి విషయాలు ఇప్పటికప్పుడు బయటకు రావు. కొన్నేళ్ల తర్వాత ఎప్పుడో, ఇంకేదో సినిమా గురించో మాట్లాడేటప్పుడు ఈ సినిమా నష్టం (వచ్చి ఉంటే) హీరో కూడా పంచుకున్నాడు అనే వార్త రావొచ్చు. ఒకవేళ రామ్‌చరణ్ ఇదే పని చేస్తే.. ఇతర హీరోలకు స్ఫూర్తి రగిల్చేవాడు అవుతాడు. టాలీవుడ్‌లో ఇప్పటివరకు చాలామంది హీరోల సినిమాలు డిజాస్టర్లు అయినా నిర్మాతలకు డబ్బులు వెనక్కి ఇవ్వలేదు.