Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

అతి సర్వత్రా వర్జయేత్‌.. అంటే ఏ విషయంలోనైనా మితిమీరి వ్యవహరించడం లేదా హద్దులు దాటడం ఎప్పుడూ పనికిరాదు. అందుకే దాన్ని విడనాడాలని అర్థం. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. చాలా సందర్భాల్లో వాడుంటారు. లేదంటే వినుంటారు. ఇప్పుడు ఎందుకు దీని గురించి అనుకుంటున్నారా? ఏం లేదండీ.. సండే స్పెషల్ అనుకున్నారో ఏమో.. ‘రాకా’ సినిమా గురించి ఓ యువ దర్శకుడు అదిరిపోయే హైప్‌ ఇచ్చే పని చేశారు. దాని వల్ల హైప్‌ పెరగకపోగా.. నెటిజన్ల ట్రోలింగ్‌ని ఎదుర్కొన్నారు..

Raaka

ఈ విషయం పసిగట్టిన ఆ సినిమా హీరో అల్లు అర్జున్‌ టీమ్‌ యాక్టివ్‌ అయిపోయింది. తూచ్‌.. తామెప్పుడూ ఆ మాటలు అనలేదు అంటూ క్లారిటీ ఇచ్చేసింది. దీంతో ట్రోలింగ్‌ ఇప్పటికి ఆగినా.. ఆ తర్వాత మళ్లీ మొదలయ్యే ప్రమాదం పొంచే ఉంది. అసలేమైందంటే.. భారతీయ సినిమా రంగానికి గర్వకారణంగా నిలిచే సినిమాను అట్లీ తీస్తున్నారు. ఆయన ఇటీవల నాకు కొన్ని విజువల్స్ చూపించారు. ‘అవతార్‌’లో కూడా అంతటి గొప్ప విజువల్స్ చూడలేదు అని యువ దర్శకుడు శిబి చక్రవర్తి అన్నారు.

అక్కడితో ఆయన ఆగకుండా ఆ సన్నివేశాలను వర్ణించడానికి అద్భుతం అనే పదం సరిపోదు. మరో రెండు, మూడు రోజుల్లో మీరందరూ వాటిని చూస్తారు అని చెప్పారు. అంటే శిబి చెప్పింది సినిమా గ్లింప్స్‌ గురించి అని అర్థమవుతోంది. ఇంకా ఆయన మాట్లాడుతూ భారతీయ సినిమాను రాజమౌళి ఎలాగైతే తదుపరి స్థాయికి తీసుకువెళ్తున్నారో.. అట్లీ కూడా ‘రాకా’తో మన ఇండస్ట్రీని ప్రపంచం ముందు మరింత ఎత్తులో నిలబెడతారు అని అన్నారు. అట్లీ దగ్గర శిబి శిష్యరికం చేసిన విషయం తెలిసిందే.

ఈ వ్యాఖ్యలు వైరల్‌ అవ్వడంతో జేమ్స్‌ కామెరూన్‌ ‘అవతార్‌’కి ‘రాకా’కి పోలిక పెట్టడం అంటే పెద్ద సాహసమే అనే కామెంట్లు వినిపించాయి. తర్వాత ఈ వ్యాఖ్యలు సినిమా ఫలితం మీద ప్రభావం చూపిస్తాయి అనిపించింది. ఈ విషయం బన్నీ టీమ్‌ వరకు వెళ్లింది. దీంతో ఆయన మేనేజర్ శరత్ చంద్ర నాయుడు స్పందించారు. ‘గ్లోబల్ ట్రయంఫ్’ అనే పదాన్ని ఓ ప్రత్యేక కారణంతోనే వాడామని, ఆ విషయం త్వరలోనే అందరికీ తెలుస్తుందని ఆయన చెప్పారు. ఒక్క విషయం స్పష్టం చేస్తున్నాం.. ‘రాకా’ చిత్ర బృందం ఎప్పుడూ ఈ సినిమాను ఇతర గొప్ప సినిమాలతో పోల్చలేదు. కథపై మాకు పూర్తి నమ్మకం ఉంది. కంటెంటే మాట్లాడుతుంది’’ అని క్లారిటీ ఇచ్చారు.

మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus