ఇప్పుడు తగ్గిపోయింది కానీ.. ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్ ఎవరైనా టాలీవుడ్‌కి వచ్చినా.. టాలీవుడ్ హీరోయిన్ ఎవరైనా బాలీవుడ్‌కి వెళ్లినా ‘అక్కడా ఇక్కడా డిఫరెన్స్’ ఏంటి అనే ప్రశ్న వచ్చేది. దానికి ఆయా నటులు సమాధానాలు ఇచ్చేవారు. ‘అవునా అలా ఉంటుందా?’ అనే కామన్ ఎక్స్‌ప్రెషన్ ఒకటి కూడా కనిపించేది. గత కొన్నేళ్లుగా ఈ ప్రశ్న వినిపించడం లేదు. బాలీవుడ్ పరిస్థితి ప్రస్తుతం ఏమంత బాలేదు అనే టాక్ నేపథ్యంలో మళ్లీ ఈ ప్రశ్న బయటకు వచ్చింది. తాజాగా ‘పెద్ది’ సినిమా కథానాయిక జాన్వీ కపూర్‌కి ఈ ప్రశ్న ఎదురైంది.
రామ్ చరణ్ – జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో బుచ్చిబాబు సానా తెరకెక్కించిన చిత్రం ‘పెద్ది’. జూన్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ.. బాలీవుడ్, టాలీవుడ్ గురించి మాట్లాడింది. దక్షిణాది సినిమా సెట్స్‌లో ఆసక్తి కనిపిస్తుంది. ఓ సినిమా పూర్తి చేయాలనో, డెడ్‌లైన్లను అందుకోవాలనో మాత్రమే పనిచేయరు. సినిమాలోని ప్రతి సీన్ అద్భుతంగా రావాలనే ప్రయత్నిస్తారు. దానికోసం ఎంత సమయమైనా ఇస్తారు.
అదే హిందీ సినిమా పరిశ్రమలో బడ్జెట్, టైమ్‌లైన్స్ ప్రాధాన్యం ఇస్తారు. అంతా రూల్ ప్రకారం, పక్కా ప్రణాళికతో చేస్తారు. కొన్నిసార్లు ఈ అతిజాగ్రత్త వల్ల క్రియేటివిటీ విషయంలో రాజీపడాల్సి వస్తుంది. అయితే ఇలా పక్కాగా ఉండటం వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి అని చెప్పింది జాన్వీ. అనవసర ఖర్చులు, అనుకున్న సమయానికి సినిమాలు పూర్తవ్వడం లాంటివి ఆ ఉపయోగాలు అని చెప్పొచ్చు.
టాలీవుడ్‌లో నటీనటులకే కాదు, టెక్నీషియన్లకు కూడా అవసరమైన బ్రేక్స్ ఇస్తారు. లంచ్ బ్రేక్‌లో 40 నిమిషాలు భోజనం చేసి, 20 నిమిషాలు నిద్రపోయి ఫ్రెష్‌గా పనిలోకి వస్తారు. బాలీవుడ్‌లో ఒక్కోసారి ఈ విషయంలో రాజీపడాల్సి వస్తుంది అని చెప్పింది. దీంతో ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరుసగా బాలీవుడ్ సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్ ఇలా టాలీవుడ్ గురించి గొప్పగా చెప్పడం అంటే బాలీవుడ్ పరిస్థితి ఎంత ఇబ్బందిగా ఉందో అర్థం చేసుకోవచ్చు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.