చిరంజీవి సినిమాల లైనప్‌ని నమ్మడానికి లేదబ్బా.. ఎప్పుడు చూసినా మారుతూ ఉంటుంది – ఈ మాట సగటు ప్రేక్షకుడు మాత్రమే కాదు, అభిమాని కూడా అనుకుంటూ ఉంటాడు. ఇందులో ఎవరికీ ఎలాంటి సెకండ్ ఒపీనియన్ ఉండదు. ఎందుకంటే ఇటీవల కాలంలో చిరంజీవి లైనప్ అలా మారుతూ వచ్చింది. సీరియల్ నెంబర్‌లు ఇచ్చినా.. అవి ఆ తర్వాత మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు కూడా చిరంజీవి సినిమాల లైనప్ మారింది అనే వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమా తర్వాత ఏం చేస్తారు అనే విషయం గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ‘విశ్వంభర’ సినిమాకి ఏ సీరియల్ నెంబర్ వస్తుందో ఇంకా తెలియడం లేదు. ఆ విషయం పక్కన పెడితే చిరంజీవి ఇటీవల వరుసగా యువ దర్శకులు కథలు చెబుతున్నారట. అలా తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు ఓ కథ చెప్పారు అని కోడంబాక్కం వర్గాల టాక్.
గతంలో చెప్పిన లెక్క ప్రకారం చిరు తర్వాతి సినిమా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేయాలి. ఈ మేరకు సినిమా ప్రకటన కూడా వచ్చింది. అయితే ‘ది ప్యారడైజ్’ ఫలితం కారణంగా సినిమా విషయంలో చిరంజీవి పునరాలోచనలో పడ్డారు అని చెబుతున్నారు. అయితే కథ విషయంలో అవసరమైన చర్చలు జరిపాక సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నారని సమాచారం. దీంతో ఆ సినిమా నెంబర్ కూడా మారుతుందని టాక్.
ఆ సినిమా ప్లేస్‌లోనే కార్తిక్ సుబ్బరాజు సినిమా రావొచ్చు అని చెబుతున్నారు. మరోవైపు బుచ్చిబాబు సానా, కల్యాణ్ కృష్ణ కురసాల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ‘పెద్ది’ సినిమా తర్వాత బుచ్చిబాబు సానా చిరంజీవికి ఓ కథ చెప్పారట. చిరు చెప్పిన మార్పులతో మరోసారి కలుస్తారట బుచ్చిబాబు. ఇక కల్యాణ్ కృష్ణ అయితే చాలా రోజులుగా ఓ కథ సిద్ధం చేస్తున్నారు. అక్కినేని నాగార్జున నిర్మాణంలో ఈ సినిమా ఉండొచ్చని టాక్.