‘ది ప్యారడైజ్’ థియేటర్ల దగ్గర అందుకున్న ఫలితం గురించి కాకుండా.. ఈ సినిమా ఓటీటీలోకి వస్తే ఏమవుతుంది అనే చర్చనే ఎక్కువగా సాగింది అంటే అతిశయోక్తి కాదు. థియేటర్లలో ఈ సినిమాను లైట్ తీసుకున్న నెటిజన్లు.. ఈ సినిమా ఓటీటీలోకి వచ్చాక దాని మీద శూలశోధన చేస్తారని అప్పుడే అంచనా వేశారు. అనుకున్నట్లుగానే ఇప్పుడు జరుగుతోంది. ‘ప్యారడైజ్’ ఓటీటీలోకి వచ్చాక.. చర్చంతా నాని అప్పట్లో ఇచ్చిన హైప్‌లు, కయాదు లోహర్ చూపించిన విధానం మీదనే డిస్కషన్ నడుస్తోంది.
సినిమా గురించి ట్రైలర్ రిలీజ్ ముందు వరకు నాని చెప్పిన దానికి.. అసలు సినిమాకు సంబంధం లేదు. సినిమా ఫ్లోకి దెబ్బపడింది. విషయం పక్కదారి పట్టింది. ప్రియదర్శి వేసిన పాత్ర సినిమాకు రాజకీయ టచ్‌ను కూడా అందించింది. ఆయనకు ప్రశంసలు వచ్చినా.. కొంతమందికి సినిమా విషయంలో కోపం వచ్చింది. ఇక హీరోయిన్ చుక్క అలియాస్ కయాదు లోహర్ విషయంలో అయితే విమర్శల వాడీవేడీ బాగా పెరిగింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చాక క్లిప్పింగ్లు కట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు.
ఒక హీరోయిన్‌ను ఇలా చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది.. అసలు సుకుమార్ శిష్యుడేనా ఇలాంటి పాత్ర రాసుకున్నది అంటూ ఏకేస్తున్నారు. ‘పెద్ది’ సినిమా విషయంలో అచ్చియమ్మ పాత్రకు ఎంత బ్యాక్‌లాష్ వచ్చిందో.. ఇప్పుడు చుక్క పాత్ర విషయంలోనూ అంతే వస్తోంది. ‘పెద్ది’ విషయంలో థియేటర్లలో వినిపించిన ఈ భిన్న స్వరం.. ‘ప్యారడైజ్’ విషయంలో ఓటీటీకి వచ్చాక వచ్చింది. ఎవరి సంగతి ఎలా ఉన్నా.. ఈ సినిమా కయాదుకు పెద్ద తలనొప్పే.
ఇప్పటికే ఆమె విషయంలో కొన్ని భారీ విమర్శలు ఉన్నాయి. తమిళంలో ఎంట్రీ ఇచ్చిన తొలి రోజుల్లో కొన్ని కుంభకోణాల విషయంలో ఆమె పేరు చక్కర్లు కొట్టింది. ఇప్పుడు ఈ పాత్ర చేయడంతో ఆ కామెంట్లు ఇప్పుడు బయటకు తీస్తున్నారు. దీంతో కయాదుకు ఇప్పుడు ‘చుక్కలు’ కనిపిస్తున్నాయి. పాత్రల ఎంపిక విషయంలో జాన్వీ ఇప్పుడేం చేస్తోందో కయాదు కూడా అదే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సౌత్ సినిమాలంటే జాన్వీ ఇప్పుడు ఒకటికి పది సార్లు చెక్ చేసుకుంటోందట. ‘పెద్ది’, ‘దేవర’లో ఆమె పాత్రలను చూపించిన తీరు ఇబ్బందిగా మారడమే కారణం.