కేవీఎన్ ప్రొడక్షన్స్.. సౌత్‌లో ఓ పెద్ద సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. 2021లో ‘పొగరు’ సినిమాతో మొదలైన వారి ప్రయాణం అదే ఏడాది ‘శకత్’ సినిమాతో నిర్మాణం ప్రారంభించింది. అక్కడికి ఏడాదికి ‘బై టు లవ్’ అనే సినిమా నిర్మించారు. ఈ రెండూ కన్నడలోనే. ఆ తర్వాత ఏమైందో ఏమో.. సినిమా డిస్ట్రబ్యూషన్ మీదే ఎక్కువగా దృష్టిసారించారు. ఇక నిర్మాణ రంగంలోకి రారేమో అనుకుంటుండగా.. గతేడాది వరుస సినిమాలు అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఆ సినిమాలు విడుదలకు ఇబ్బందులు వస్తున్నాయి.
కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఇప్పుడు మూడు భారీ సినిమాలు తెరకెక్కాయి/ తెరకెక్కుతున్నాయి. విజయ్ ‘జననాయగన్’, యశ్ ‘టాక్సిక్’ అంతా సిద్ధమై త్వరలో విడుదల అనేసరికి వివిధ కారణాల వల్ల ఆగిపోయాయి. ‘జననాయగన్’కు సెన్సార్ / కోర్టు చిక్కులు రాగా, ‘టాక్సిక్’ సినిమాకు ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం (?) అడ్డంకిగా మారింది. ‘టాక్సిక్’ కొత్త రిలీజ్ డేట్ చెప్పినా ఆ రోజు వస్తుందో లేదో చూడాలి. ‘జన నాయగన్’ సంగతి సరేసరి.
ఇక ఇదే బ్యానర్‌లో రూపొందుతున్న ‘కేడీ: ది డెవిల్’ సినిమాను ఏప్రిల్ ఆఖరున రిలీజ్ చేస్తారు అని అంటున్నారు. అదొస్తే నిర్మాతకు కాస్త రిలీఫ్. ఎందుకంటే ఆయన డబ్బులు మొత్తం సినిమాల్లోనే ఉండిపోయింది. అవి రిలీజ్ అయితేనే ఆయనకు డబ్బులు వచ్చేది. ఈ కారణంతోనే చిరంజీవి – బాబి సినిమా హోల్డ్‌లో పడిందని సమాచారం. ఆ సినిమా నిర్మాత కూడా మారుతారు అని అంటున్నారు. ఇదంతా చూస్తుంటే ‘కేవీఎన్’కి ఎందుకింత కష్టం అనే చర్చ నడుస్తోంది.
ఆయన తప్పు ఉన్నా లేకపోయినా బాధపడుతున్నది మాత్రం ఆయన. నిర్మాతలు ఎప్పుడూ త్వరత్వరగా సినిమా చేసేసి రిలీజ్ చేసి మరో సినిమాకు ప్లాన్ చేస్తుంటారు. ఇప్పుడు ఇలా రెండు పెద్ద సినిమాలు చేతిలోనే ఉండిపోతే ఇబ్బందే కదా. లేకలేక నాలుగేళ్ల తర్వాత తిరిగి సినిమా నిర్మాణంలోకి వచ్చిన ఆయనకు ఈ ఇబ్బందులు ఎప్పుడు తొలగిపోతాయే చూడాలి.