ఆ కుటుంబం నుండి హీరోలు దాదాపు 25 ఏళ్ల లోపు వయసులోనే అరంగేట్రం చేశారు. ఆ ఫ్యామిలీ హీరోల ఇండస్ట్రీ ఎంట్రీ (సోలో హీరోగా) సగటు వయసు 21 ఏళ్లు మాత్రమే. అలాంటి ఫ్యామిలీ నుండి కొత్త తరంగా రాబోతున్న హీరో వయసు ఇప్పటికే 31 దాటిపోయింది. దీంతో ఎప్పుడెప్పుడు అరంగేట్రం చేస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఆయనే నందమూరి కుటుంబం నయా వారసుడు (కానున్న) మోక్షజ్ఞ. బాలయ్య కుమారుడి ఎంట్రీ గురించి చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఓ హై ఆక్టేన్ విషయం తెలిసింది.
మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఇప్పటివరకు వచ్చిన పుకార్లలో కెల్లా ఇది చాలా బలమైనది. ఎందుకంటే ఇప్పటివరకు సూపర్ హీరో సినిమాల దర్శకుడు, ప్రయోగాత్మక సినిమాల దర్శకులు, మాస్ సినిమాల దర్శకుల పేర్లే ఈ చర్చలో వినిపించాయి. తొలిసారి పాన్ ఇండియా సినిమాలు చేస్తే సూపర్ మాస్ దర్శకుడి పేరు వినిపిస్తోంది. ఆయనే సందీప్ రెడ్డి వంగా. సందీప్ – మోక్షజ్ఞ కాంబోను సెట్ చేసే పనుల్లో ప్రస్తుతం బాలయ్య అండ్ కో. ఉన్నారని ఓ వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ పుకారు చాలా బాగుంది. జరిగితే బాగుండు అని కూడా అనిపిస్తుంది. కానీ ఇప్పటికిప్పుడు జరగడం చాలా కష్టం అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం సందీప్.. ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న తీసుకొస్తామని చెప్పారు. మరి తెస్తారో వాయిదా వేస్తారో చూడాలి. ఆ సినిమా తర్వాత ‘యానిమల్ పార్క్’ సినిమా ఉంది. ఇది కాకుండా మహేష్‌బాబు, అల్లు అర్జున్, రామ్‌చరణ్ ప్రాజెక్ట్‌లు వరుసలో ఉన్నాయని టాక్. ఈ సమయంలో మోక్షజ్ఞతో సినిమా అంటే డౌటే. ఒకవేళ సెట్ అయితే మాత్రం కిక్కే కిక్కు. అయితే మోక్షు ఓ మంచి ప్రేమ కథ కోసం చూస్తున్నాడు అని ఆ మధ్య నారా రోహిత్ చెప్పాడం గమనార్హం.
ఇకపై చెప్పిన వయసు కాన్సెప్ట్ చూస్తే.. బాలకృష్ణ 24 ఏళ్ల వయసులో హీరో కాగా, కల్యాణ్ రామ్ 25 ఏళ్లకు హీరో అయ్యాడు. ఇక ఎన్టీఆర్ 18వ ఏటే హీరో అవ్వగా.. దివంగత తారకరత్న 19 ఏళ్లకు హీరో అయ్యారు.