నాగచైతన్య ప్రస్తుతం ‘వృషకర్మ’ అనే సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. గత కొన్ని నెలలుగా ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. నాగచైనత్య కెరీర్‌లో అతి భారీ చిత్రం అవుతుందని నాగచైతన్య పదే పదే చెబుతూ వస్తున్నాడు. ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు కూడా ఆ ఆసక్తిని పెంచుతున్నాయి. అలా ఈ సినిమా మీద మంచి అంచనాలే వచ్చాయి. అయితే ఇప్పుడు చర్చ ఆ 24వ సినిమా గురించి కాదు. ఆ తర్వాత చేయాల్సిన 25వ సినిమా గురించి ఇప్పుడు చర్చ.
ఎందుకంటే.. 24వ సినిమా పనులు చివరి దశకు వచ్చాయి. దీంతో నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది. దీనికిగాను ఇద్దరు దర్శకుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కార్తికేయ గుమ్మకొండ సినిమా ‘బెదురులంక 2012’ ఫేమ్ క్లాక్స్ ఇప్పటికే నాగచైతన్య ఓ కథ వినిపించినట్లు వార్తలొచ్చాయి. ఆ సినిమా ఫిక్స్ అని పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు క్లాక్స్ కాదు.. వేరే దర్శకుడి పేరు బయటకు వచ్చింది. అతనే ‘మసూద’ సినిమాతో మెప్పించిన దర్శకుడు సాయి కిరణ్.
కొన్ని రోజుల క్రితం చైతూకి సాయి కిరణ్ ఓ హారర్ థ్రిల్లర్ కథను వినిపించారట. ప్రస్తుతం ఈ కథపై చర్చలు జరుగుతున్నాయట. త్వరలోనే ఈ సినిమా విషయంలో క్లారిటీ వస్తుందట. ఇప్పటివరకు నాగచైతన్య హారర్ సినిమాలు చేయలేదు. అయితే ‘దూత’ అనే హారర్ టచ్ ఉన్న వెబ్‌సిరీస్ చేశాడు. దానికి మంచి స్పందనే వచ్చింది. మరిప్పుడు ఆ సిరీస్ స్ఫూర్తితో సినిమాల్లో కూడా హారర్ టచ్ చేస్తాడా అనేది చూడాలి. చేస్తే కచ్చితంగా చైతుకి కొత్త రకం సినిమా అవుతుంది. అయితే, మైల్ స్టోన్ అయిన 25వ సినిమాగా ఓ హారర్ చిత్రాన్ని చేస్తారా అనేది ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఇలాంటి మైల్ స్టోన్ సినిమాగా మాస్ కమర్షియల్ సినిమాలు చేస్తుంటారు. మరి చైతు కొత్తగా ఆలోచిస్తాడా అనేది చూడాలి.