ఇండియన్ సినిమాలో వజ్రాల్లాంటి సినిమాల లిస్ట్ అంటూ ఒకటి రాస్తే.. అందులో టాప్‌లో ఉండే పేర్లలో ‘తుంబాడ్’ ఒకటి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక సినిమా కోసం ఏకంగా ఏళ్ల తరబడి వర్షం కోసం వేచి చూసి.. ఆ వర్షంలోనే సినిమా షూటింగ్ చేసి.. మ్యాజిక్ లాంటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రూ.10 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా తొలి రిలీజ్‌లో రూ.15 కోట్లు.. సెకండ్ రిలీజ్‌లో రూ.38 కోట్లు వసూళ్లు సాధించి నెవర్ బిఫోర్ సినిమాగా నిలిచింది.
ఇలాంటి సినిమాకు సీక్వెల్ వస్తోంది అంటే ఎలాగైనా ఆసక్తి వచ్చేస్తుంది. అలాంటి సినిమాలో స్టార్ హీరోయిన్ ఆలియా భట్‌ను తీసుకొచ్చారు. ‘తుంబాడ్’ సీక్వెల్ కోసం ఆలియా భట్ తమ టీమ్‌లో భాగమైనట్లు నిర్మాత, నటుడు సోహమ్ షా అధికారికంగా ప్రకటించారు. అలియాతో కలసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. సినిమా మెయిన్ కాన్సెప్ట్ అయిన అన్నం బొమ్మను పట్టుకుని ఆ ఫొటోలో పోజిచ్చారు ఆలియా, సోహమ్. దీంతో ఇప్పుడు ఈ సినిమా కాస్ట్‌లీగా మారిపోయింది.
ఈ సినిమాను వచ్చే ఏడాది డిసెంబరు 3న విడుదల చేయనున్నారు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాకు ఇన్ని రోజులు ఎందుకు అనే డౌట్ రావొచ్చు. పైన చెప్పాం కదా.. వర్షం కోసం వెయిట్ చేసి, చేసి ఏళ్ల తరబడి ‘తుంబాడ్’ సినిమాను తీశారు. ఇప్పుడు సీక్వెల్ కోసం ఇంకెన్ని ఆసక్తికరమైన పనులు చేస్తున్నారో. ‘తుంబాడ్’ సినిమాను రాహి అనిల్ బార్వే తెరకెక్కించగా.. దాని సీక్వెల్‌కి ఆదేశ్ ప్రసాద్ దర్శకుడు. పెన్ స్టూడియోస్, సోహుమ్ షా ఫిల్మ్స్ కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో భాగమవుతున్న సందర్భంగా అలియా మాట్లాడుతూ ‘‘తుంబాడ్’ తొలిసారి చూసినప్పుడే నా మనసులో ఉండిపోయింది. చాలా తక్కువ సినిమాలు అలా కథలో లీనమయ్యేలా ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రపంచంలో భాగం కావడం ప్రత్యేకం’’ అని చెప్పారు.