Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

నాగార్జున గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఫిట్‌నెస్‌ గురించి, లుక్‌ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ విషయంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే నేటి తరం యంగ్‌ హీరోలకు పోటీగా ఆయన లుక్స్‌, బాడీని మెయింటైన్‌ చేస్తూ వస్తున్నారు. ఈ రోజు (ఆగస్టు 29) ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఓసారి ఈ విషయాల గురించి కాకుండా.. ఆయన సినిమాల ఎంపిక గురించి చూద్దాం. ఎందుకంటే తెలుగు సినిమాలోనే కాదు ఇండియన్‌ సినిమాలో కూడా ఆయనలా కథలను ఓకే చేసి, రిస్క్‌ చేసి.. పాత్రలు చేసిన వారు అరుదు కాబట్టి.

Nagarjuna

* హీరోగా కెరీర్‌ ప్రారంభమై మూడు సినిమాలే చేశారు. ఆ టైమ్‌లో అంటూ గడ్డం పెంచుకుని, అమ్మాయి దూరమైందని దిగాలు లుక్‌తో ఓ పాత్ర అంటే ఏ హీరో కూడా ముందుకు రారు. కానీ మన ‘మజ్ను’ చేశాడు.

* ఆ హీరోయిన్‌కి అప్పటికే స్టార్‌ అనే పేరు. ఆమెతో సినిమా చేస్తే ప్రేక్షకులు ఆమెనే చూస్తారు అని తెలిసి కూడా ఓ సినిమా చేసిన హీరోలు ఉంటారా. కానీ విహారి (ఆఖరి పోరాటం) ఆ పని చేశాడు. మెప్పు పొందాడు.

* హీరో అంటే గలగలా మాట్లాడాలి. డాషింగ్‌ లుక్‌లో కనిపించాలి. ఆరోగ్యవంతుడిగా ఉండాలి అనుకునే రోజుల్లో మరికొద్ది రోజుల్లో చనిపోయే హీరో పాత్ర ఎవరైనా హీరో చేయడానికి ముందుకొస్తారా? కానీ ‘గీతాంజలి’తో ప్రకాశ్‌ చేశాడు.

* ఎవరి దగ్గరా దర్శకత్వ శాఖలో పని చేయని, పెక్యూలియర్‌ మైండ్‌ సెట్‌ ఉన్న కుర్రాడు వచ్చి సినిమా చేద్దాం అని కథ చెబితే అంత ఈజీగా ఎవరూ చేయకపోవచ్చు. కానీ మన ‘శివ’ చేశాడు. చరిత్ర సృష్టించాడు.

* స్టార్‌ హీరో సినిమా అంటే ఆరు పాటలు. మూడు ఫైట్లు అనుకుంటున్న ఆ రోజుల్లో ‘చైతన్య’ అంటూ వచ్చి.. మొత్తం లెక్కలను మార్చేశాడు. సినిమా అంతా జీపు రేసింగ్‌తోనే సరిపోతుంది.

* ఇప్పుడంటే యాంటీ హీరో పాత్రలు స్పెషల్‌గా కనిపిస్తున్నాయి కానీ.. ఈ ప్రయత్నం ఎప్పుడో ఈశ్వర్‌ ప్రసాద్‌/ ప్రేమ్‌ కృష్ణగా ఆ పని చేసి చూపించాడు. ఎందులోనో తెలుసు కదా.. ‘కిల్లర్‌’ లో.

* అండర్‌ వరల్డ్‌, కింగ్డమ్‌లు ఇప్పుడు మనకు పాన్‌ ఇండియా ట్రెండ్‌లు అయిపోయాయి. కానీ ఇలాంటి ప్రయత్నం ఎప్పుడో ‘అంతం’ టైమ్‌లోనే చేసేశాడు రాఘవ/శేఖర్‌.

* స్టార్‌ హీరోలు కొన్ని రకాల సినిమాలు చేయాలి. అందులో భక్తిరస చిత్రాలు ఉండవు అనే మాట ఒకటి ఉండేది. ఈ లెక్కన ‘అన్నమయ్య’ సినిమాతో పటాపంచలు చేశాడు. ఆ తర్వాత అదే కోవలో మరో రెండు సినిమాలూ చేశాడు.

* ‘నాక్కొంచెం మెంటల్‌’.. ఈ డైలాగ్‌ని ఓ స్టార్‌ హీరో చెబితే.. ఇప్పుడు ఇవి కామన్‌. కానీ హీరో ఆల్వేజ్‌ ఆన్‌ టాప్‌ అని ఫ్యాన్స్‌ అనుకునే రోజుల్లోనే ఇలాంటి క్యారెక్టరైజేషన్‌తో ‘శివమణి’గా వచ్చాడు.

* సినిమా అంతా మీరు చక్రాల కుర్చీలోనే కనిపిస్తారు – ఎవరైనా రైటర్‌/ డైరెక్టర్‌ వచ్చి ఈ స్టోరీ లైన్‌ చెబితే.. ‘థ్యాంక్యూ అని చెప్పేసి పంపించే’ హీరోలు ఉన్న ఈ రోజుల్లో ఇండస్ట్రీకి తన ప్రయోగంతో ‘ఊపిరి’ పోశాడు.

* సినిమాలో మీరు ఉంటారు కానీ.. ఆత్మలా కనిపిస్తారు.. ఈ మాట స్టార్‌ హీరోలకు అంతగా రుచించకపోవచ్చు. కానీ అలాంటి సినిమాలు చేసి ఇండస్ట్రీకి, అభిమానులకు తన సత్తాను మరోసారి రుచి చూపించాడు ‘బంగార్రాజు’.

* సీనియర్‌ హీరోలు ఇంకా హీరోగానే రన్‌ అవుతున్న తెలుగు సినిమా పరిశ్రమలో ‘కుబేర’ అనే సినిమా ఒప్పుకొని షాకిచ్చాడు. అందులో తన పాత్ర హీరో కాదు, విలన్‌ కాదు. మల్టిపుల్‌ షేడ్స్‌ ఉంటాయి. వాటిని ఎంత బాగా హ్యాండిల్‌ చేశాడో దీపక్‌.

* స్టార్‌ హీరో సినిమా చిన్న పాత్ర చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్న హీరోలున్న రోజులివి. ఇంకా ఉన్నారా అంటే ఉన్నారు మరి. ఈ సమయంలో సైమన్‌గా మారి ‘కూలీ’కి పోటాపోటీగా బరిలోకి దిగారు. సైమన్‌ సెన్సేషనల్‌ అయ్యాడు కూడా.

* ఇప్పుడు ‘కింగ్ 100’గా వస్తున్నాడు. గ్లింప్స్‌లో అయితే కొత్త నాగార్జున కనిపించాడు. సినిమా సంగతి డిసెంబరు 24న తేలుతుంది.

అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

 

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus