స్టార్ ఫ్యామిలీస్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే వారసులపై చాలా బాధ్యతలు ఉంటాయి. ఒక్కోసారి అది వాళ్లకు బర్డెన్ లా కూడా మారొచ్చు. వాళ్లకు గ్రాండ్ డెబ్యూ అయితే దక్కుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, తమ వారసులకు సక్సెస్ అందించడం అనేది స్టార్స్ చేతిలో ఉండదు. ఆడియన్స్ వాళ్ళని ఓన్ చేసుకుంటేనే సక్సెస్ వరిస్తుంది. ఒక్కోసారి కథల ఎంపిక సెట్ అవ్వకపోయినా రిజల్ట్ తేడా కొట్టొచ్చు, లేదా సక్సెస్ రావడం కాస్త లేట్ అవ్వొచ్చు.
అఖిల్ విషయంలో కూడా ఆల్మోస్ట్ ఇలాగే జరిగింది. వాస్తవానికి ‘సిసింద్రీ’ సినిమాతోనే అఖిల్ ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టాడు. ‘ఏమీ తెలియని పసితనంలోనే అఖిల్ నటన ఇరగదీశాడు.. ఇక పెద్దయ్యాక కచ్చితంగా బ్లాక్ బస్టర్స్ కొట్టి, తండ్రిని మించిన స్టార్‌డమ్ అందుకుంటాడు’ అంటూ 90ల టైమ్‌లోనే యావత్ తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా అక్కినేని అభిమానులు అతనిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. దానికి తోడు ‘మనం’ సినిమాలో అఖిల్ క్యామియో కూడా బాగా క్లిక్ అయింది.
దీంతో అఖిల్ డెబ్యూపై భారీ హైప్ ఏర్పడింది. ఈ అంచనాల నడుమ విడుదలైన ‘అఖిల్ – ది పవర్ ఆఫ్ జువా’ సినిమా ఫ్లాప్ అయ్యింది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. కానీ.. ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోలేకపోయింది. రెండో సినిమా ‘హలో’కు మంచి టాక్ వచ్చింది, కానీ కమర్షియల్ గా అది కూడా వర్కౌట్ కాలేదు. ‘మిస్టర్ మజ్ను’ పరిస్థితి కూడా అంతే.
ఆ తర్వాత వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ డీసెంట్ సక్సెస్ అందుకోవడంతో అఖిల్ ఖాతాలో మొదటి హిట్ పడింది. కానీ అక్కినేని అభిమానులు ఆశించిన మాస్ హిట్ కాదు అది. అయితే, ఆ తర్వాత యాక్షన్ ఇమేజ్ కోసం చేసిన ‘ఏజెంట్’ నిరాశపరిచింది. ఈ క్రమంలో కొంత గ్యాప్ తీసుకుని ‘లెనిన్'(Lenin) చేశాడు. ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ మెచ్చే విధంగా అఖిల్ పెర్ఫార్మెన్స్ ఉంది.
కమర్షియల్ గా కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకునే అవకాశాలు ఉన్నాయి. సొ అక్కినేని అభిమానులు ఆశించిన మాస్ హిట్ దక్కినట్టే. దీంతో ‘లెనిన్’ టీమ్ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంది.నాగార్జున కూడా ఈ సినిమాకి ఓ నిర్మాత అనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అఖిల్, నాగార్జున ఎమోషనల్ అయ్యారు. నాగార్జున పాదాలపై పడి అఖిల్ కన్నీళ్లు పెట్టుకోగా.. నాగార్జున కూడా బాగా ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.