టాలీవుడ్‌లో ఈ మధ్య ప్రేక్షకులు రిపీట్ జోడీలకంటే ఫ్రెష్ కాంబినేషన్లకే ఎక్కువ మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. అదే దిశగా దర్శక, నిర్మాతలు కూడా కొత్త జోడీలతో, కొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
నేచురల్ స్టార్ నాని వరుస హిట్లతో దూసుకుపోతూనే, హీరోగా మాత్రమే కాదు నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ‘ఓజీ’తో భారీ అంచనాల నడుమ పవర్ స్టార్ అభిమానులను మెప్పించిన దర్శకుడు సుజిత్ తో నాని ఓ బిగ్ బడ్జెట్ సినిమాకు సిద్ధమవుతున్నారన్న వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం. ఇందులో నానిని ఇప్పటివరకు చూడని విధంగా, స్టైలిష్ లుక్‌తో పవర్‌ఫుల్ పాత్రలో చూపించనున్నారట.
ఇక తాజా అప్‌డేట్ ప్రకారం ఈ సినిమాలో నాని సరసన పూజా హెగ్దేను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు ఒక వార్త బాగా వినిపిస్తోంది. ఇది నాని-పూజా హెగ్దే కు కూడా మొదటిసారి కావడంతో అభిమానులు ఉత్సాహం వ్యక్తం చేస్తుండగా, మరి కొందరు మాత్రం ఆమె గత చిత్రాల ఫలితాలపై చర్చ మొదలుపెట్టారు. వరుస ఫ్లాప్‌ల తర్వాత వచ్చిన ఈ అవకాశం ఆమెకు టర్నింగ్ పాయింట్ అవుతుందా? లేక అనుమానాలే నిజమవుతాయా? అన్నది చూడాలి.
నాని గతంలో ‘దసరా’, ‘హాయ్ నాన్న’ లాంటి చిత్రాలతో తన వర్సటిలిటీని నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఈ సుజిత్ ప్రాజెక్ట్‌తో పాటు మరో రెండు సినిమాలను కూడా లైనప్‌లో పెట్టుకున్నారని టాక్. మరి ఈ ఫ్రెష్ కాంబో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.