నాని-కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ “నేను లోకల్”. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యువకథానాయకుడు నవీన్ చంద్ర నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేయడం విశేషం. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం నాని ఖాతాలో మరో విజయవంతమైన సినిమాగా నిలిచిందా? లేక నిరాశపరిచిందా? అనే విషయం తెలుసుకోవాలంటే “ఫిల్మీ ఫోకస్” రివ్యూని పూర్తిగా చదవాల్సిందే..!!
కథ : లోకల్ బాబు (నాని) కాపీ కొట్టి ఇంజరీనింగ్ పాస్ అయ్యి.. మొదటిచూపులోనే కీర్తి (కీర్తి సురేష్)ను ప్రేమించి.. ఆమెకోసం ఎం.బి.ఏ కాలేజ్ లో జాయిన్ అవుతాడు. కీర్తి తనను ప్రేమించేలా చేయడమే నిరంతర ధ్యేయంలా ముందుకుసాగుతున్న బాబుకి కరెక్ట్ గా కీర్తి వర్కవుట్ అయ్యింది అనుకొనే సరికి కథలోకి సడన్ ఎంట్రీ ఇస్తాడు సిద్దార్ధ వర్మ (నవీన్ చంద్ర). అసలు సిద్దార్థవర్మ ఎవరు, అతనికి కీర్తితో ఉన్న రిలేషన్ ఏమిటి, బాబుకి అడ్డంకిగా ఎందుకు మారాడు? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే “నేను లోకల్” సినిమా చూడాల్సిందే!
నటీనటుల పనితీరు : నాని ఎప్పట్లానే ఈజ్ తో బాబు క్యారెక్టర్ ను న్యాయం చేశాడు. అలాగే “యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్” అన్న ట్యాగ్ లైన్ కు తగ్గట్లు క్యారెక్టర్ కు యాటిట్యూడ్ ను జోడించి సరికొత్త వ్యవహారశైలితో అలరించాడు. కీర్తి సురేష్ క్యూట్ గా ఉంది. తన పాత్ర సినిమాల కంటే బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. హీరో ఫాదర్ గా పోసాని కృష్ణమురళి మరోమారు తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకొన్నాడు. హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ లో సచిన్ మాత్రం కామెడీ వరకూ పర్లేదు కానీ.. ఎమోషన్ ను మాత్రం పండించలేకపోయాడు. నవీన్ చంద్రకు కథలో ఉన్న ఇంపార్టెన్స్.. క్యారెక్టర్ పరంగా లేకపోవడంతో వెండితెరపై నిండైన విగ్రహంతో దర్శనమివ్వడం మినహా పెద్దగా చేసిందేమీ లేదు.
సాంకేతికవర్గం పనితీరు : దేవిశ్రీ బాణీలు, నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ టెక్నికల్ గా బాగున్నాయి. ఎడిటింగ్ సింక్ అవ్వలేదు. ఫస్టాఫ్ లో ల్యాగ్ ఎక్కువయ్యింది. ప్రసన్న కుమార్ బెజవాడ సంభాషణలు నేటి యువతకు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. హీరోయిన్ ని “పొట్టి” అని ముద్దుగా పిలవడం, హీరో చేత మరీ పెద్ద డైలాగ్స్ చెప్పించకుండా సింపుల్ పంచెస్ తో కామెడీ పండించడం వంటివి బాగున్నాయి. అయితే.. కథ విషయంలో మాత్రం పాత చింతకాయ పచ్చడినే మళ్ళీ తినిపించాడు. ఏవో ఒక పది సినిమాల కలగలుపు గంపలా అనిపిస్తుంది సినిమా చూస్తున్నంత సేపు. అలాగే.. స్క్రీన్ ప్లే విషయంలోనూ చాలా లాజిక్స్ మిస్ చేశాడు.
దర్శకుడు త్రినాధరావు నక్కిన రచయిత ప్రసన్న కుమార్ పేపర్ మీద పెట్టిన సన్నివేశాన్ని తెరకెక్కించాడే కానీ.. తన స్వంత బుర్రను పెద్దగా వాడలేదు. దానివల్ల సినిమా సాగిపోతున్నా.. కథకి ప్రేక్షకుడు కనెక్ట్ కాలేదు. అలాగే.. సినిమా మొత్తం హీరో క్యారెక్టరైజేషన్ మీదే కాన్సన్ ట్రేట్ చేయడం వల్ల మిగతా క్యారెక్టర్స్ ఏవీ ఎలివేట్ అవ్వలేదు. మధ్యలో “కామెడీ ఉండాలి కాబట్టి పెట్టాం” అన్నట్లుగా వచ్చే పోలీస్ స్టేషన్ సీన్ బాగా బోర్ కొట్టించడం, క్లైమాక్స్ లో హీరో లాజిక్ కన్విన్సింగ్ గా లేకపోవడం వంటి కారణాల వల్ల నానికి వీరాభిమానులైతే తప్ప “నేను లోకల్” చిత్రాన్ని సాధారణ ప్రేక్షకులు పెద్దగా ఎంజాయ్ చేయలేరు.
విశ్లేషణ : “ఇక్కడ కామేడీ చేసినా నేనే చేయాలి” అని ఏదో సినిమాలో హీరో అన్నట్లు.. “నేను లోకల్” సినిమాలో అన్నీ రసాలను నాని ఒక్కడే పండించేయాలని చేసిన విశ్వప్రయత్నం ఒక నటుడిగా అతడికి మంచి పేరు తీసుకురావచ్చేమో కానీ.. ప్రేక్షకుడు మాత్రం 143 నిమిషాల పాటు గ్యాప్ లేకుండా డైలాగులు చెబుతున్న “నాని”ని చూడలేక కాస్త ఇబ్బందిపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సో, ఓవరాల్ గా నాని వీరాభిమానులకు మాత్రమే నచ్చే చిత్రం “నేను లోకల్”.
రేటింగ్ : 2.5/5