కీర్తిసురేష్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం “రివాల్వర్ రీటా”. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం చాలా సైలెంట్ గా ఎలాంటి హడావుడి లేకుండా తెలుగులోనూ అదే పేరుతో అనువాదరూపంలో విడుదలైంది. డార్క్ హ్యూమర్ థీమ్ తో తెరకెక్కిన ఈ రివెంజ్ డ్రామా ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ:
చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో.. తన తల్లి చల్లమ్మ (రాధిక శరత్ కుమార్)తో కలిసి కుటుంబ బాధ్యతలు మోస్తుంటుంది రీటా (కీర్తి సురేష్). తన అక్క బిడ్డ మొదటి పుట్టినరోజు వేడుక సెలబ్రేట్ చేసుకుంటున్న తరుణంలో లోకల్ డాన్ డ్రాకుల పాండ్యన్ (సూపర్ సుబ్బరాయన్) ఇంటికి వచ్చి లేనిపోని గోల చేయబోతాడు. అనుకోకుండా అతడ్ని రీటా & ఆమె తల్లి కలిసి చంపేస్తారు.
అంత పెద్ద డాన్ ను చంపేస్తే పరిణామాలు ఏంటి అనేది వాళ్లు రియలైజ్ అయ్యి.. ఆ హత్య నుండి బయటపడడానికి రీటా & ఫ్యామిలీ పడిన పాట్లే “రివాల్వర్ రీటా” కథాంశం.
నటీనటుల పనితీరు:
కీర్తిసురేష్ స్క్రీన్ ప్రెజన్స్ & లుక్స్ లో మాత్రమే వైవిధ్యం చూపిస్తోంది. ఆమె ఆ వైవిధ్యం పండించాల్సింది నటన విషయంలో. కానీ.. అక్కడే టెంప్లేట్ కి ఫిక్స్ అయిపోతుంది. ఆమె నటిగా జాతీయ స్థాయిలో నిరూపించుకుంది. కొత్తగా ప్రూవ్ చేసుకోవడానికి ఏమీ లేదు. కానీ.. ప్రతి పాత్రలోనూ వైవిధ్యం చూపించాల్సిన అవసరం మాత్రం చాలా ఉంది. ఆ విషయాన్ని కీర్తిసురేష్ కాస్త త్వరగా రియలైజ్ అయితే మంచిది.
రాధిక శరత్ కుమార్ కామెడీ అక్కడక్కడా నవ్విస్తుంది. సగటు తల్లిగా ఆమె వేషధారణ, భాష, మ్యానరిజం చాలా సహజంగా ఉన్నాయి.
సాధారంగా రెడిన్ కింగ్స్లేను చాలా రొటీన్ గా చూపిస్తుంటారు. కానీ.. ఈ సినిమాలో అతడి టైమింగ్ కానీ, క్యారెక్టరైజేషన్ కానీ కొత్తగా కనిపించాయి. హాస్యం కూడా బాగానే వర్కవుట్ అయ్యింది.
సునీల్ ను సీరియస్ గా చూపించాలనుకోవడంలో తప్పు లేదు కానీ.. ఎంతో టాలెంటెడ్ ఆర్టిస్ట్ ను రొటీన్ విలన్ గా చూపించడం అనేది మైనస్ అయ్యింది.
జాన్ విజన్, అజయ్ ఘోష్ ల క్యారెక్టర్లు రొటీన్ అయిపోయాయి. వాళ్లను ఆ తరహా పాత్రల్లో ఇప్పటికే పదుల సార్లు చూసి ఉండడం వల్ల.. కొత్తగా ఫన్ ఏమీ జనరేట్ అవ్వలేదు.
సాంకేతికవర్గం పనితీరు:
“మానాడు” అనే తమిళ చిత్రంతో రచయితగా మంచి పేరు తెచ్చుకున్న జేకే చంద్రు.. “రివాల్వర్ రీటా” విషయంలోనూ రచయితగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు. డార్క్ హ్యూమర్ ను మరీ డార్క్ గా కాకుండా కాస్త లాజికల్ & రియలిస్టిక్ గా చూపించే ప్రయత్నం చేశాడు. కథగా కొత్తగానే ఉన్న ఈ చిత్రం.. సినిమాగా మాత్రం అలరించలేకపోయింది. అందుకు కారణం సీన్ కంపోజిషన్ లో కొత్తదనం లేకపోవడమే. ఒకటికి పదిసార్లు నయనతార నటించిన “కో కో కోకిల” గుర్తుకొస్తుంది. ఆ సినిమా ఛాయలు గట్టిగానే కనిపిస్తాయి. కాస్త కొత్తగా ఉండడానికి పాండిచ్చెర్రి సెటప్ ట్రై చేసారు కానీ.. సందర్భాలు ఎందుకో సింక్ అవ్వలేదు. లాజికల్ గా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. అవన్నీ ఈ సినిమాకి మైనస్ అనిపిస్తాయి. అందువల్ల దర్శకుడిగా చంద్రు ఆకట్టుకోలేకపోయాడని చెప్పాలి.
సియాన్ రోల్డన్ సంగీతం సినిమాకి సింక్ అవ్వలేదు. సినిమా టోన్ కి, బీజియం కి సూట్ అవ్వలేదు. ప్రొడక్షన్, ఆర్ట్ డిపార్ట్మెంట్లు తమ బెస్ట్ ఇచ్చారు. నిర్మాతలు కూడా అవసరమైనంత ఖర్చు చేసారు.
విశ్లేషణ:
డార్క్ డ్రామాలు ఆశ్చర్యపరిస్తేనే ఆడియన్స్ ను అలరించగలవు. సగటు క్రైమ్ కామెడీలా సాగిపోతే పెద్దగా ఆకట్టుకోలేవు. “రివాల్వర్ రీటా” కోర్ పాయింట్ కానీ.. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కానీ ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ.. వాటిని దర్శకుడు చంద్రు హ్యాండిల్ చేసిన విధానం సరిగా లేకపోవడంతో ఓ రొటీన్ డార్క్ కామెడీ సినిమాగా మిగిలిపోయింది కానీ.. ఆడియన్స్ ను ఎంగేజ్ చేయలేకపోయింది. సినిమా మొత్తానికి రాధిక శరత్ కుమార్ క్యారెక్టరైజేషన్ & రెడిన్ కింగ్స్లే పంచులు మాత్రమే కాస్త రిలాక్సేషన్.
ఫోకస్ పాయింట్: ఈ పస లేని రివెంజులెందుకు రీటా!
రేటింగ్: 2/5