Single Screens: మొదలైన పర్సంటేజీ విధానం… సింగిల్‌ థియేటర్‌ కష్టాలకు బ్రేక్‌ పడుతుందా?

తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల గురించి మాట్లాడుకుంటే.. ముఖ్యంగా సింగిల్‌ స్క్రీన్ల గురించి మాట్లాడుకుంటే ఎక్కువగా వినిపించే టాపిక్ అద్దె విధానం. థియేటర్లకు అద్దె విధానం పెద్ద గుదిబండలా మారిపోయింది అనే మాటలు వినిపించేవి. ఇలాంటి కారణాల వల్లే సింగిల్‌ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్నాయని, కల్యాణ మండపాలు అవుతున్నాయని వాదనలు వచ్చేవి. దీనికి విరుగుడు రెవెన్యూ షేర్‌ అని కూడా విశ్లేషకులు చెబుతూ వచ్చారు. ఈ విషయంలో చాలా కాలంగా జరుగుతున్న చర్చలు ఇప్పుడు తేలి.. రెవెన్యూ షేర్‌ విధానం వచ్చింది.

Single Screens

అవును, ఈ మేరకు తెలంగాణ ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు. మల్టీప్లెక్స్‌ స్క్రీన్ల తరహాలో సింగిల్‌ స్క్రీన్లలో పర్సంటేజీ విధానంలోనే సినిమాలను ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. తొలుతగా హైదరాబాద్‌లోని 23 సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల యాజమాన్యాలు రెవెన్యూ షేర్‌ ఒప్పందం కిందకు వచ్చాయి. ఏప్రిల్‌ 3 నుండి ఈ విధానం అమల్లోకి రానుంది. ఏదైనా సినిమా ప్రదర్శితమైన తొలి వారం 60 శాతం, రెండో వారం 50 శాతం, మూడో వారం 40 శాతం షేర్‌ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను ఇటీవల 23 మంది ఎగ్జిబిటర్లు కలసి చర్చలు జరిపారు. తమ థియేటర్లు ముఖ్యమైన ప్రదేశాల్లో ఉన్నాయని, ప్రేక్షకులకు అన్ని సౌకర్యాలు కల్పించామని, అయితే నిర్వహణకు అవుతున్న ఖర్చు అద్దె విధానంలో తము రావడం లేదని చెప్పారు. అద్దె విధానంతో కుదరదని, పర్సంటేజీ ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శిస్తామని ప్రతిపాదన చేశారు. దీంతో తెలంగాణలోని అన్ని సింగిల్ స్క్రీన్‌లలో సినిమాలను పర్సంటేజీ ప్రాతిపదికనే ప్రదర్శించాలని నిర్ణయించారు. తొలుత హైదరాబాద్‌లోని 23 థియేటర్లలో విధానం ప్రారంభించారు.

బెంగళూరులో మార్చి 11న జరిగిన దక్షిణ భారత ఎగ్జిబిటర్ల సమావేశంలో ఈ విషయంలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారని ఛాంబర్‌ తెలిపింది. మరి థియేటర్ల యాజమాన్యాలు కోరినట్లు నష్టాలు పోతాయా? పెద్ద సినిమాలు కూడా ఇలా షేర్‌ పద్ధతిన ఇస్తారా అనేది చూడాలి. ఎందుకంటే చిన్న సినిమాల షేర్‌ రావడం కంటే పెద్ద సినిమాలు షేర్‌ రావడమే థియేటర్లకు లాభం చేకూరుస్తుంది.

గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags