ఒక హీరో వరుస సినిమాలు చేస్తూ ఉంటే అతని ఫ్యాన్స్ చాలా ఆనందంగా ఉంటారు. అయితే అది ఆ సినిమాల అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూ, సినిమాలు చెప్పిన డేట్‌కి రిలీజ్ అయితేనే ఆ ఆనందం ఉంటుంది. అలా కాకుండా సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎంత మిగిలి ఉంది అనే సమాచారం లేకపోవడం. ఒకవేళ ఆ సమాచారం వచ్చినా.. రిలీజ్ విషయంలోనూ ఇబ్బందులు రావడం లాంటివి జరిగితే వరుస సినిమాలు చేసినా ఉపయోగం లేదు.
ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఎందుకంటే అతని చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగా.. ఒక సినిమా సెట్స్ మీదకు వచ్చి.. మళ్లీ ఆగుతోంది. ఇంకో సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వస్తుందో తాజాగా తెలిసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌కి క్లారిటీ బదులు కన్‌ఫ్యూజన్ వచ్చింది. డార్లింగ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమాల అప్‌డేట్స్ వచ్చాయి. దాంతోనే ఈ పరిస్థితి.
హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమాను మార్చి 19న విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ రోజుకు వస్తుందా లేదా అనేది అప్పుడు చూడొచ్చు. అంటే ఫిబ్రవరి ఆఖరి వరకు ఈ సినిమా పనుల్లో ప్రభాస్ బిజీగా ఉంటాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ‘స్పిరిట్’ సినిమాను అక్టోబరు ఆఖరులో రిలీజ్ చేస్తామని చెప్పారు. అంటే సెప్టెంబరు ఆఖరు వరకు ఈ సినిమా పనుల్లో ఉంటాడు డార్లింగ్.
అయితే, ‘సలార్ 2’ సినిమా షూటింగ్‌ను జూన్‌లో స్టార్ట్ చేస్తామని ఇటీవల ప్రభాస్ – ప్రశాంత్ నీల్ చెప్పేశారు. అంటే ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ అవుతుండగానే ఈ సినిమా షూటింగ్ కూడా చేయాలి. మరోవైపు ఆగుతూ ఆగుతూ షూటింగ్ జరుపుకుంటున్న ‘కల్కి 2’ పనులు కూడా త్వరలో స్టార్ట్ అంటున్నారు. అంటే ఒకేసారి మూడు సినిమాల షూటింగ్‌లు చేయాలి. ప్రభాస్ విషయంలో ఈ ఫీట్ మనం ఇప్పటివరకు చూడలేదు. కాబట్టి డేట్స్‌తో డార్లింగ్ కన్‌ఫ్యూజ్ చేస్తున్నాడు అనే చెప్పొచ్చు.