కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్మెంట్ అనే పేరుకు న్యాయం చేస్తూ.. ఎలాంటి కథ ఎంచుకున్నా, ఎలాంటి నేపథ్యం ఎంచుకున్నా వినోదం అందించడంలో ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉన్నాడు శ్రీవిష్ణు. చేతిలో రెండు సినిమాలు ఉన్న శ్రీవిష్ణు.. మరో సినిమాకు ఓకే చెప్పారు అని తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన శ్రీవిష్ణు.. వచ్చే ఏడాదీ ఇదే ఆలోచనలో ఉన్నాడు అని ఆ లైనప్ చూస్తే అర్థమవుతోంది.
రీసెంట్‌గా ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న శ్రీవిష్ణు.. 2027 సంక్రాంతి బరిలో ‘ఫ్యామిలీ ప్యాక్’ సినిమాతో రావాలని ప్లాన్ చేస్తున్నారు. తనకు ‘సామజవరగమన’ అంటూ గతంలో అదరగొట్టిన రామ్ అబ్బరాజు – శ్రీవిష్ణు కాంబోలో రూపొందుతున్న సినిమా అది. ఇది కాకుండా ‘ఇది మన అందరి కథ’ అనే సినిమా కూడా చేస్తున్నారు. సన్నీ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ రెండు లైన్‌లో ఉండగా.. మరో సినిమా కూడా దాదాపు ఓకే చేశాడట.
ఒక మైథలాజికల్ టచ్ ఉన్న కథను ఇటీవల శ్రీవిష్ణు ఓకే చేశారట. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ‘రంగబలి’ సినిమా ఫేమ్ పవన్ బాసంశెట్టి డైరెక్ట్ చేస్తారట. ఇప్పటికే చాలా రకాల జోనర్లలో సినిమాలు చేసి మెప్పించి, నవ్వించిన శ్రీవిష్ణు ఇప్పుడు మైథలాజికల్ సబ్జెక్ట్‌తో శ్రీవిష్ణు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. అందులోనూ కామెడీ టచ్ ఉండేలా చూసుకుంటాడేమో.
ఇక పవన్ బాసంశెట్టి ప్రస్తుతం సత్య, యోగిబాబుతో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవల ఆ సినిమా మొదలైంది. ఆ తర్వాతనే శ్రీవిష్ణు సినిమా ఉంటుంది అని సమాచారం. అన్నట్లు పవన్ సంగతి చెప్పలేదు కదా. ‘రంగబలి’లో ఆయన రాసిన హాస్యం ప్రేక్షకుల్ని మెప్పించింది. కాబట్టి మినిమమ్ గ్యారెంటీ కథనే ఇప్పుడు ఆయన నుండి ఆశించొచ్చు.