టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినీ అభిమానులను ఉత్కంఠకు గురిచేసే భారీ బాక్సాఫీస్ పోరుకి రంగం సిద్ధం అవుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మధ్య రాబోయే ఈద్ 2027 సందర్భంగా భారీ క్లాష్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న’స్పిరిట్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తుండగా, యాక్షన్ మరియు ఇంటెన్స్ ఎమోషన్స్ కలగలిపిన కథతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ప్రభాస్ మార్కెట్ పాన్ ఇండియా స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఈ సినిమా పలు భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయటానికి మేకర్స్ సిద్ధం అవుతున్నారు.
ఇదే సమయంలో, సల్మాన్ ఖాన్ కూడా తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌తో అదే ఈద్ సీజన్‌ను టార్గెట్ చేస్తున్నారు. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. ఈద్ పండుగ సీజన్ సల్మాన్‌కు ఎప్పటినుంచో లక్కీ స్లాట్‌గా భావించబడుతుండటంతో, ఆయన ఈ సమయాన్ని వదులుకునే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది.
ఈ రెండు భారీ సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ అయితే థియేటర్ల కేటాయింపు, స్క్రీన్స్ పంపిణీ వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. ఒకవేళ రెండు చిత్రాలు సమానంగా బజ్ సృష్టిస్తే, బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఖాయం. అయితే ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, చివరి నిమిషంలో విడుదల తేదీల్లో మార్పులు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తానికి, ఇద్దరు స్టార్ హీరోలు, పెద్ద బడ్జెట్లు అన్నీ కలిసి ఈద్ 2027 ఆసక్తికరంగా మారనుంది.