ప్రముఖ బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌పై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిషేధం లాంటి ఓ ఆర్డర్ ఇచ్చింది. ఆ తర్వాత అది నిషేధం కాదని.. అతనితో పని చేయొద్దు అని తమ సభ్యులకు చెప్పాం అంటూ ఫెడరేషన్ చెప్పుకొచ్చింది. ఈ కన్‌ఫ్యూజన్ + క్లారిటీ ఓవైపు నడుస్తుండగా.. ఇప్పుడు ఈ విషయంలో ఓ అప్‌డేట్ వచ్చింది. దాన్ని అప్‌డేట్ అని అనాలో.. లేక ఈ విషయంలో ఏదో ఒకటి తేలే పరిస్థితి వచ్చిందో అనాలో మీరే చెప్పాలి.
ప్రముఖ నిర్మాత టీపీ అగర్వాల్ బొంబాయి సివిల్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రణ్‌వీర్ సింగ్‌పై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ విధించిన నాన్ కో- ఆపరేషన్ ఆదేశాలకు వ్యతిరేకంగా ఇప్పుడు టీపీ అగర్వాల్ కోర్టు మెట్లు ఎక్కారు. సినిమా పరిశ్రమకు చెందిన ఏ సభ్యుడి మీద కూడా నిషేధం విధించే అధికారం ఏ సంస్థకూ లేదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు టీపీ అగర్వాల్.
ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ లాంటి సంస్థలకు ఇలాంటి ఆదేశాలు జారీ చేసే హక్కు లేదు. గతంలో నేను, దర్శకుడు విపుల్ షా కలసి ఇలాంటి ధోరణులకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశాం. సినిమా రంగం పరస్పర సహకారంతో నడిచే ఓ వేదిక. ఈ తరహా విషయాలను చట్టపరమైన, వృత్తిపరమైన మార్గాల్లోనే పరిష్కరించుకోవాలి. ఒక వ్యక్తితో ఎవరూ పని చేయకూడదంటూ బలవంతం చేయకూడదు. ఇలాంటి నిర్ణయాల వల్ల ఎంతోమందికి జీవనోపాధి దెబ్బతింటుంది అని అగర్వాల్ చెప్పారు.
అసలేమైందంటే.. ‘డాన్ 3’ సినిమా నుంచి రణ్‌వీర్ సింగ్ తప్పుకోవడంతో ఫరాన్ అక్తర్‌తో వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలోనే రణ్‌వీర్‌పై ఫెడరేషన్ నిషేధం విధిస్తామని చెప్పింది. ఇక అగర్వాల్ సంగతి చూస్తే.. గతంలో 17 ఏళ్ల పాటు ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌కు, నాలుగుసార్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా పని చేశారు. అలాంటి ఆయన ఇప్పుడు రణ్‌వీర్ సింగ్‌కు మద్దతుగా నిలవడం ఆసక్తికరం.