టాలీవుడ్‌లో ఆర్.నారాయణమూర్తి అలగ్. అందరూ ఒక దారిలో నడిస్తే ఆయన ఇంకో దారిలో నడుస్తారు. రెగ్యులర్, కమర్షియల్ సినిమాలకు దూరంగా తనదో ప్రత్యేకమైన జోనర్. ప్రజల సమస్యలు, సామాజిక అంశాల నేపథ్యంలో ఆయన సినిమాలు తెరకెక్కిస్తుంటారు.. నటిస్తుంటారు. ఎన్నో ఏళ్లుగా ఆయన అదే పని చేస్తూ వస్తున్నారు. ఆయన సినిమాలకు ఆదరణ తగ్గుతున్నా ఆయన ఆగడం లేదు. అలాంటి నటుడి దగ్గరకు వెళ్లి కమర్షియల్ సినిమా చేయమంటే చేస్తారా? కచ్చితంగా చేయరు.
గతంలో కొంతమంది దర్శకులు ఈ ప్రయత్నం చేశారు కూడా. ఆయన ఎప్పుడూ నో చెబుతూనే వచ్చారు. దీంతో ఆ పాత్రకు ఆయన పేరు పెట్టుకుని మురిసిపోయిన దర్శకుడు ఉన్నారు. ఆ విషయం తర్వాత చూద్దాం. అంత పట్టుబట్టి కూర్చున్న ఆర్.నారాయణమూర్తి ఇప్పుడు ఓ కమర్షియల్ సినిమాకు ఓకే చెప్పారని సమాచారం. ఎనిమిదేళ్ల క్రితం టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ‘హుషారు’ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ సిద్ధమవుతోంది. త్వరలో ప్రారంభమవుతుంది అంటున్న ఈ సినిమాలో ఆర్.నారాయణమూర్తి ఓ కీలక పాత్రలో కనిపిస్తారని సమాచారం.
సింపుల్ స్టోరీ, యూత్‌ఫుల్ ఎలిమెంట్స్, ఆసక్తికరమైన పాటలతో శ్రీహర్ష కొనుగంటి రూపొందించిన సినిమా ‘హుషారు’. ఇప్పుడు ఇంచుమించు అలాంటి జోనర్‌లో రెండో పార్టుకు రెడీ అవుతున్నారట. అందులో ఒక ముఖ్యమైన నక్సలైట్ పాత్రలో నటించడానికి ఆర్.నారాయణమూర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాలీవుడ్ వర్గాల భోగట్టా. తన భావజాలానికి దగ్గరగా ఉండే పాత్ర కావడంతో ఆయన అంగీకరించారని చెబుతున్నారు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది.
ఇక పైన చెప్పిన ఆ పాత్ర పేరు పెట్టుకుని సినిమా చేసిన పాయింట్‌కి వస్తే.. తారక్ ‘టెంపర్’ సినిమాలో పోసాని కృష్ణమురళి చేసిన కానిస్టేబుల్ మూర్తి పాత్రను తొలుత ఆర్.నారాయణమూర్తికి ఆఫర్ చేశారట. ఈ క్రమంలో పారితోషికం దగ్గర కూడా పెద్ద మాటలే వినిపించాయట. కానీ ఆయన ఓకే చేయలేదు. ఇప్పుడు ఈ సినిమా ఓకే చేశారు అంటే సినిమాలో, పాత్రలో ఏదో మ్యాజిక్ ఉండాలి.