రామ్‌చరణ్ – సుకుమార్ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉండనుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అప్పుడెప్పుడో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా కంటే ముందే ఈ సినిమా ఓకే అయిపోయింది. అయితే ఈ సినిమా వరుస నెంబరు 17. దీంతో 16వ సినిమా (పెద్ది) అయ్యేవరకు అభిమానులు ఈ సినిమా గురించి అప్‌డేట్‌ల గురించి వెయిట్ చేశారు. సందర్భం వచ్చింది కదా అని 16వ సినిమా సక్సెస్ మీట్ వేదికపై 17వ సినిమా గురించి అడిగితే దర్శకుడు సుకుమార్ నో చెప్పారు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి కొన్ని వివరాలు వైరల్ అవుతున్నాయి.
ఏ సినిమాకు ఆ హీరో ఎలాంటి లుక్ రెడీ చేసుకున్నా.. తన సినిమాల దగ్గరకు వచ్చేసరికి హీరోకు డిఫరెంట్ లుక్ రెడీ చేస్తారు సుకుమార్. ఇప్పుడు రామ్‌చరణ్‌కి కూడా ఇలాంటి లుక్ రెడీ చేస్తున్నారట. ‘పెద్ది’ సినిమా కోసం తనని తాను మార్చుకుని తెరపై ఊర మాస్ లుక్‌లో, ప్లేయర్ లుక్‌లో కనిపించిన రామ్‌చరణ్.. ఇప్పుడు మళ్లీ లుక్‌ని మార్చనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో సినిమా కోసమే ఈ కొత్త లుక్. ఈ సినిమాను పీరియాడిక్ కథతో, ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్ని ఆవిష్కరించి తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
సుకుమార్ ప్రపంచంలో హీరో పాత్ర కోసం చరణ్ సిద్ధం కావల్సి ఉంటుందట. ప్రస్తుతం రెస్ట్ మోడ్‌లో ఉన్న చరణ్.. త్వరలోనే లుక్‌పై దృష్టి పెట్టనున్నారని సమాచారం. ఒక్కో లుక్ ట్రై చేసి, ఫొటో షూట్‌లు చేసి.. ఫైనల్‌గా ఓ లుక్ ఫిక్స్ చేస్తారట. దీని కోసం కొన్ని నెలల సమయం పడుతుందని చెబుతున్నారు. మరోవైపు ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి చేసే ఫ్లోలో ఉందట లెక్కల మాస్టారి టీమ్. సెప్టెంబరు నాటికి ఈ మొత్తం పనులు పూర్తి చేయాలని అనుకుంటున్నారట.
ఈ క్రమంలో సినిమా ప్రధాన తారాగణం పనులను కూడా చూడాలని అనుకుంటున్నారట. ఈసారి కూడా హీరోయిన్‌ని హిందీ నుండే తీసుకొస్తారట. ఓ హీరోయిన్ వారసురాలు చరణ్ సినిమాలో నటించొచ్చని టాక్. ఇవన్నీ చేసి అక్టోబరులో చిత్రీకరణ ప్రారంభించేలా ప్లాన్స్ వేసుకుంటున్నారట.