‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా మీద చాలా నమ్మకాలే పెట్టుకున్నారు మెగా ఫ్యాన్స్. స్క్రీన్ ప్రజెన్స్.. స్క్రీన్ ప్రజెన్స్ అంటూ సినిమా మీద కంటే రామ్‌చరణ్ (Ram Charan) లుక్స్, పాత్ర మీదే ఎక్కువ ఫోకస్ పడేలా చేశారు దర్శకుడు శంకర్ (Shankar) . సినిమా టీమ్ మొత్తం ఈ టాపిక్ గురించే ప్రచారంలో ఎక్కువగా మాట్లాడింది. అయితే సినిమా వచ్చాక ప్రజెన్స్ ఆకట్టుకుంది కానీ.. సినిమానే ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ చేదు ఫలితం నుండి త్వరలో బయటపడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఈ క్రమంలో కొత్త సినిమా షూటింగ్ మొదలుపెడితే ఆ అప్డేట్స్తోనైనా హ్యాపీ అవ్వాలనేది వారి ఆలోచన. అందుకే బుచ్చిబాబు సినిమా పనులు వేగవంతం చేయాలని కోరుతున్నారు. వాళ్లు అనుకున్నట్లుగా సినిమా అప్డేట్ ఒకటి వచ్చింది. కొత్త నెలలో రామ్‌చరణ్ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేస్తాడట. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లో ఫిబ్రవరి 1 నుండి సినిమా షూటింగ్ ఉండనుందట.
పీరియాడిక్ కథతో రూపొందుతున్న ఈ సినిమా కోసం నాటి వాతావరణాన్ని తలపించేలా సెట్‌ను రూపొందించారట. అందులోనే రాత్రి సమయాలల్లో షూటింగ్ జరుపుతారట. ఈ సినిమాకు ‘పెద్ది’ అనే పేరును పరిశీలిస్తున్నారు. గ్రామీణ క్రీడల నేపథ్యంలో ఈ సిఇమా సాగుతుంది ఇప్పటికే వార్తలొచ్చాయి. ఈ చిత్రం కోసం రామ్ చరణ్ జుట్టు, గడ్డం, దేహం పెంచి కొత్త లుక్‌లోకి మరోసారి మారిపోయాడు.
ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ (A.R.Rahman) స్వరాలందిస్తున్నారు. ఇటీవల ఆయన సినిమా నుండి తప్పుకున్నారు అంటూ పుకార్లు వచ్చాయి. దానిని టీమ్ ఖండించింది. ఇక కొత్త షెడ్యూల్లో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆమె ఉండి ఉంటే ఈపాటికి హైదరాబాద్ వచ్చేది. ఇక ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను గతేడాది ఆఖరులో మైసూరులో షూట్ చేసిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల పాటే ఆ షెడ్యూల్ సాగింది. మరి ఇప్పుడు హైదరాబాద్ షెడ్యూల్ ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.